
చివరిదాకా లామాగా కొనసాగుతా: దలైలామా
నేడు 90వ జన్మదిన వేడుకలు
ధర్మశాల: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా త్వరలో తన వారసుడిని ప్రకటిస్తారన్న వార్తలకు చెక్‌పెడుతూ దలైలామా శనివారం తన మనసులో మాట వెల్లడించారు. మరో 30–40 ఏళ్లు జీవించాలనే ఆశ ఉందని, తుదిశ్వాస వరకు బుద్ధుని బోధనలను శక్తివంచలేకుండా వ్యాప్తి చెందిస్తానని ఆయన ప్రకటించారు. జీవించి ఉన్నంతకాలం తానే లామాగా కొనసాగుతానని ఆయన పరోక్షంగా చెప్పారు.
ఆదివారం తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని హిమాలయాల్లోని మెక్లియోడ్‌గంజ్ పట్టణంలోని సుగ్లాగ్‌ఖాంగ్ ఆలయంలో దలైలామా ఆయుష్ష బాగుండాలంటూ శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. శక్తిస్వరూపిణిగా పేర్కొనే ‘ఒరాకిల్’.. దలైలామా చెంతకొచ్చి ఆయనను ఆశీర్వదించింది. ఒరాకిల్ ఆవాహనను ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కీలకఘట్టంగా చెప్పొచ్చు.
ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మీడియాతో మాట్లాడారు. ‘‘కాలజ్ఞానం నాకేదో చెబుతున్నట్లు అనిపిస్తోంది. నాపై అవలోకితేశ్వర ఆశీస్సులు కురుస్తున్నట్లు తోస్తోంది. ఇప్పటికే నా శాయశక్తులా కృషిచేశా. ఇలా బుద్దుని బోధనలను వ్యాప్తి చెందించేందుకు నేను మరో 30–40 సంవత్సరాలు జీవించాలని ఆశ పడుతున్నా. నాపై అవలోకితేశ్వర ప్రభావం చిన్నతనం నుంచే ఉంది. బౌద్ధధర్మాన్ని మరికొంత కాలం ప్రపంచానికి చాటిచెబుతా. అందులోభాగంగానే 130 ఏళ్లు వచ్చేవరకు జీవిస్తాననే భావిస్తున్నా’’అని అన్నారు.