
కేంద్ర మంత్రి రిజిజు, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె హాజరు
మెక్లియోడ్ గంజ్‌లో భారీ ఏర్పాట్లు
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్‌గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.
అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్‌పెన్ ఖిమ్‌సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది.
ప్రముఖులు హాజరు
జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి.
వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్‌కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది.