గుడ్‌ న్యూస్‌: ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్‌ | Covishield Price For States Reduced To 300 Rupees | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్‌

Apr 28 2021 6:24 PM | Updated on Apr 28 2021 8:21 PM

Covishield Price For States Reduced To 300 Rupees - Sakshi

భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికి కలిసి దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ 14.77 కోట్లు దాటింది. ప్రస్తుతానికి కేంద్రమే వ్యాక్సినేషన్‌ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుంది. అయితే మే 1 నుంచి వ్యాక్సిన్‌ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను కేంద్రానికి ఇచ్చి మిగతా 50 శాతాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు కేంద్రం వీలు కల్పించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్‌ ధర 400 రూపాయలుగా సీరమ్‌ సంస్థ ప్రకటించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్‌ ధర రూ.600గా నిర్ణయించింది. కేంద్రానికి మాత్రం కోవిషీల్డ్‌ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్‌ సంస్థ అందిస్తోంది.

తాజాగా ధర విషయంలో కోవిషీల్డ్‌ తగ్గింపు ప్రకటించింది. రాష్ట్రాలకు విక్రయించే డోసులను 400 రూపాయల నుంచి రూ.300కు తగ్గించినట్లు వెల్లడించింది. గతంలో ప్రకటించిన ధర కంటే ఇది 25% తక్కువ. రాష్ట్రాలకు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ అదర్‌ వూనావాల పేర్కొన్నారు. ‘‘సీరమ్‌ సంస్థ నుంచి ఓ ముందడుగు.  రాష్ట్రాలకు విక్రయించే కోవిషిల్డ్‌ టీకా ధరను 300కి తగ్గించాం. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. దీని ద్వారా వేల కోట్ల రాష్ట్ర నిధులు ఆదా  కానున్నాయి. టీకాలతో మరిన్ని ప్రాణాలు కాపాడండి’. అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అయితే గత వారం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిషిల్డ్‌ అధిక ధరలను ప్రకటించడంతో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 

చదవండి: కోవిషీల్డ్: ప్రైవేటు మార్కెట్లో‌ టీకా ధరలను ప్రకటించిన సీరమ్‌

Advertisement
 
Advertisement
Advertisement