
ప్రతీకాత్మక చిత్రం
పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. మానసిక రుగ్మతలైన....
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. కరోనాను కట్టడి చేసేందకు ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ బాటపట్టాయి. సెకండ్ వేవ్‌తో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో థర్డ్‌వేవ్ గోల మొదలైంది. ఫస్ట్ వేవ్‌లో మధ్య వయస్కులు, సెకండ్ వేవ్‌లో యువకులు.. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల స్వేచ్ఛ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
దాదాపు స్కూళ్లు లేక ఇంటికి పరిమితమై..నాలుగు గోడల మధ్య నలుగుతున్న చిన్ని బుర్రలు తల్లిదండ్రుల కొత్త ఆంక్షలతో మానసికంగా కృంగిపోతున్నాయి. పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వారిలో మానసిక రుగ్మతలైన దుందుడుకు స్వభావం, అహింస పెరుగుతున్నాయి. కొంతమంది చిన్నపిల్లలు తమ విషయంలో తల్లిదండ్రులు సైకాలజిస్టులను సంప్రదించటానికి కూడా ఒప్పుకోవటం లేదు. ప్రతీ చిన్న విషయానికి తీవ్రంగా స్పందించటం మొదలుపెడుతున్నారు. దీనిపై సైకాలజిస్టు సత్యకాంత్ త్రివేది మాట్లాడుతూ.. ‘‘ ఇది తల్లిదండ్రులకు గడ్డుకాలం.. ఎందుకంటే వారి పిల్లలు వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
కరోనా సమయంలో తమ పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటూ వారి తల్లిదండ్రులు నా వద్దకు రావటం పెరిగిపోయింది. ఈ సమస్యను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్ క్లాసులతోనో.. టీవీ చూస్తూనో గడుపుతున్నారు. వాటి ప్రభావం వారిపై పడుతుంది. అందుకని, తల్లిదండ్రులు వారితో కొంతసమయమైనా గడపటానికి ప్రయత్నించాలి. ఇంట్లోనే క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ ఆడించాలి. ఎక్కువ గంటలు వారితో వివిధ రకాల టాపిక్స్ గురించి మాట్లాడాలి. పాజిటివ్ విషయాల గురించే పిల్లలతో మాట్లాడాలి’’ అని అన్నారు.