
అసహజ మరణాల రిజిస్టర్‌లోని ఎంట్రీలు మాయం
2000 నుంచి 2015 దాకా నమోదైన వివరాలు లేవన్న పోలీసులు
నిజాలు బయటకు రావాలన్న ఆర్టీఐ కార్యకర్త జయంత్
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అధికారుల సమక్షంలోనే ఖననం
ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్‌కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.
పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్‌మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు.
ఇప్పుడు ఆ సమయం వచ్చింది
అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్‌కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు.
నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు.