కాంగ్రెస్‌ చీఫ్‌గా కొనసాగనున్న సోనియా

Congress Sources Says Sonia Gandhi To Remain Party Chief - Sakshi

ఆరు నెలల్లో నూతన అధ్యక్షుడి ఎన్నిక

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని ఆ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో సోనియానే పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని సీనియర్‌ నేతలు మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీలు కోరారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని 23 మంది పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీకి లేఖరాసిన నేపథ్యంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరికొన్ని నెలల పాటు కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజే సత్వర నిర్ణయం వెలువడుతుందని ఆశించరాదని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు, ఎంపికకు సమయం పడుతుందని తెలిపాయి.

పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగాలని సోనియాను తాము కోరామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని నెలలపాటు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె కొనసాగుతారని పేర్కొన్నాయి. ఆరు నెలల్లో తదుపరి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. ఇక అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్‌ నేతల తీరుపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. నాయకత్వ మార్పుపై బీజేపీ ప్రోద్బలంతోనే సీనియర్లు లేఖ రాశారన్న రాహుల్‌ వ్యాఖ్యలపై కపిల్‌ సిబల్‌, ఆజాద్‌ వంటి సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలను అనునయించేందుకు స్వయంగా రాహుల్‌ వివరణ ఇచ్చారు.

తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరోవైపు పార్టీ నాయకత్వపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేత అంబికా సోనీ కోరగా, తాము పార్టీ పరిధికి లోబడే ఆయా అంశాలను లేవనెత్తామని గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ పేర్కొన్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనే అని భావిస్తే తమపై చర్యలు చేపట్టవచ్చని అన్నారు. కాగా పార్టీ యువనేతలతో పాటు పలువురు సీనియర్‌ నేతలు, పార్టీ ముఖ్యమంత్రులు తాజా పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. చదవండి : సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top