రాహుల్‌తో బాబు రాజకీయం! | Chandrababu Naidu Politics With Rahul Gandhi Congress Party | Sakshi
Sakshi News home page

రాహుల్‌తో బాబు రాజకీయం!

Jan 21 2026 4:50 AM | Updated on Jan 21 2026 4:50 AM

Chandrababu Naidu Politics With Rahul Gandhi Congress Party

టీడీపీని దెబ్బ తీసిన బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూల్చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో  

కాంగ్రెస్‌తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్న రాజకీయ వర్గాలు

చంద్రబాబుతో క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌ ద్వారా రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించానని గతంలో రేవంత్‌ వ్యాఖ్యలు 

కాంగ్రెస్‌ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్‌ అలా మాట్లాడటం సాధ్యం కాదంటున్న విశ్లేషకులు  

చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ.. కాంగ్రెస్‌తో రహస్య కాపురం ఏమిటని బీజేపీ వర్గాల ఆగ్రహం 

ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్‌.. ఏపీ గురించి కనీసం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విస్మయం 

చంద్రబాబుతో కాంగ్రెస్‌ రహస్య ఒప్పందాలకు ఇదే నిదర్శనమంటున్న రాజకీయ వర్గాలు  

సాక్షి, అమరావతి: టీడీపీని దెబ్బ తీసిన బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూల్చాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి అలా మాట్లాడుతున్నారంటే హైకమాండ్, రాహుల్‌ ఆశీస్సులు లేకుండా సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబుతో క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌ ద్వారా రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించానని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించటాన్ని గుర్తు చేస్తున్నారు. 

ఒకవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు చంద్రబాబు కాంగ్రెస్‌ హైకమాండ్‌తో, రాహుల్‌గాందీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయాన్ని రేవంత్‌ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు – రాహుల్‌ బంధంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి.. టీడీపీని వెనకేసుకురావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి.. టీడీపీ ప్రయోజనాల కోసం తహతహలాడటం, బాధపడటం ఏమిటని విస్తుపోతున్నారు. 

‘తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. బీఆర్‌ఎస్‌ వాళ్లు గద్దెలు దిగాలి... ఊర్లలో బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలాలి..’ అని ఖమ్మం జిల్లాలో రేవంత్‌రెడ్డి సోమవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల ద్వారా రాహుల్‌గాంధీ ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్‌లో ఉంటున్నట్లు నిరూపితమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటునే మరోవైపు కాంగ్రెస్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనాలని విశ్లేషిస్తున్నారు. 

ఇక దేశంలో ఓట్ల చోరీ గురించి పదేపదే ఆందోళనకు దిగే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాందీ.. 2024 ఎన్నికల సమయంలో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రి వేళ భారీగా పోలింగ్, భారీగా దొంగ ఓట్లు గురించి ఏనాడూ కనీసం నోరు విప్పిన పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇబ్బంది కాకూడదనే ఈ అంశాన్ని ఆయన ఏనాడూ ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు. 

   
బాబు అనైతిక బంధం! 
రాజకీయ ఊసరవెల్లి నారా చంద్రబాబు మళ్లీ రంగులు మార్చుతున్నారు. ఒక్కోసారి ఒక్కో రంగు మారుస్తూ వచి్చన ఆయన ఈసారి... ఏకకాలంలో విభిన్న రంగులు మారుస్తూ ఊసరవల్లికే అసూయ కలిగిస్తున్నారు. సొంతంగా ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ప్రతి ఎన్నికకు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసగించడం బహిరంగ రహస్యమే. 

ఈసారి ఆయన తన రాజకీయ అవకాశవాదాన్ని పరాకాష్టకు తీసుకువెళుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ అక్రమ సంబంధం నెరుపుతుండటం విస్మయపరుస్తోంది. భవిష్యత్‌ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాందీతో  తెరచాటు మైత్రి కొనసాగిస్తున్నారని టీడీపీ వర్గాలు సమర్థిస్తున్నాయి. 

కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరచాటు రాజకీయ మంత్రాంగంపై బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తో అక్రమ సంబంధం కోసం చంద్రబాబు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  

బాబు స్క్రిప్ట్‌ ప్రకారమే రాజకీయ డ్రామా.. 
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. మరోవైపు కాంగ్రెస్‌తో అంటకాగుతుండటం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా నిలుస్తోందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 2018లో బీజేపీతో విడిపోయి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ... మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టినా సరే కాంగ్రెస్‌తో తెరచాటు మైత్రికి ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్త పడుతోంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ శ్రేణులు సహకరించిన విషయం తెలిసిందే. 

బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఇక రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం అయిన తరువాత కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు బంధం మరింత బలపడింది. ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని గ్రహించి అనివార్యంగా 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతమాత్రాన కాంగ్రెస్‌తో బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకోలేదు. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 

అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు ఏపీ ప్రభుత్వంలోనూ బీజేపీ, టీడీపీ భాగస్వాములుగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ శ్రేణులు కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌ తెరచాటు మైత్రి తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలో కూడా టీడీపీ ప్రత్యేక ప్రతినిధులు రాహుల్‌గాందీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్‌నాయు­డు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు టీడీపీ ఎంపీలు ఎవరూ కూడా కాంగ్రెస్‌ను విమర్శించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే రాజకీయ డ్రామా సాగుతోందన్నది సుస్పష్టం.  

ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టి..
చంద్రబాబు ఇటు బీజేపీతో బహిరంగ మైత్రి... అటు కాంగ్రెస్‌తో తెరచాటు బంధం కొనసాగిస్తే కొనసాగించుకోవచ్చు. టీడీపీ రాజకీయ వైఖరి ఆ పార్టీ ఇష్టం. కానీ అందుకోసం ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు అత్యంత ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులను చంద్రబాబు నిలిపివేయడమే అందుకు నిదర్శనం. ఆ విషయాన్ని స్వయంగా రేవంత్‌రెడ్డి తెలంగాణ శాసనసభలోనే వెల్లడించారు. 

‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని చంద్రబాబును క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌లో కోరా.. ఆయన ఆ పనులను నిలిపివేశారు..’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఆయన చెప్పింది నిజం కాదని చంద్రబాబు కనీసం ఖండించకపోవడం గమనార్హం. పైగా రాయలసీమ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదంటూ చంద్రబాబు, మంత్రులు దారుణంగా మాట్లాడటం నివ్వెరపరుస్తోంది. తద్వారా రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులను నిలిపివేశామని చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement