దేశ రాజధానిలో దారుణం జరిగితే స్పందించరా? | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో దారుణం జరిగితే స్పందించరా?

Published Mon, Aug 9 2021 1:09 AM

Congress Questions PM Narendra Modi Silence On Dalit Girl Case - Sakshi

న్యూఢిల్లీ: సాక్షాత్తూ దేశ రాజధానిలో తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్యకు గురైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎందుకు నోరువిప్పడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం నిలదీసింది. ఈ దారుణంపై ఆయన ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్‌ చేసింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని విన్నవించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితోనే ట్విట్టర్‌ యాజమాన్యం తమ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దళిత బాలిక తల్లిదండ్రులను పరామర్శిస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ ఖాతాను ట్విట్టర్‌ యాజమాన్యం తాత్కాలికంగా స్తంభింపజేసినట్లు కాంగ్రెస్‌ శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు ఇలా చేయడం సరైంది కాదని ఆ పార్టీ పేర్కొంది.

ప్రభుత్వానికి భయపడాల్సిన పనేం లేదని (డరో మత్‌) ట్విట్టర్‌కు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే సూచించారు. పార్టీ నేత రాగిణి నాయక్‌తో కలిసి ఆమె ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దళిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందించలేదని విమర్శించారు. బాలిక తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడానికి బదులు వారిని అణచివేయడానికే అధికారాలను ఉపయోగిస్తోందని రాగిణి నాయక్‌ మండిపడ్డారు. 

న్యాయం కోరడం నేరమా? 
దేశంలో మహిళల భద్రత, వారికి ఎదురవుతున్న సమస్యలపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని ఢిల్లీ కాంగ్రెస్‌ నాయకురాలు అల్కా లాంబా డిమాండ్‌ చేశారు. ఒక రోజంతా ఈ అంశానికి కేటాయించాలన్నారు. దళిత బాలిక మరణానికి దుండగులకు ఆరు నెలల్లోగా మరణ శిక్ష అమలు చేయాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఢిల్లీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అమృతా ధావన్‌ అన్నారు. ఈ దారుణాన్ని రాహుల్‌ గాంధీ లేవనెత్తకపోతే ఎప్పుడో తెరమరుగు అయ్యేదని వెల్లడించారు. బాలిక తల్లిదండ్రుల ఫొటోలను కేవలం రాహుల్‌ గాంధీ మాత్రమే కాదు, బీజేపీ నాయకులు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ (ఎన్‌సీఎస్‌సీ) సభ్యులు కూడా ట్విట్టర్‌లో షేర్‌ చేశారని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా గుర్తుచేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్‌ గాంధీ కోరడం నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సూర్జేవాలా తాజాగా ట్వీట్‌ చేశారు.  

Advertisement
Advertisement