వెనక్కితగ్గని విపక్షాలు.. ఉభయసభలు మంగళవారానికి వాయిదా..

Congress Protest Over Rahul Gandhi Disqualification Day 2 Updates  - Sakshi

► విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కూడా మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదాపడింది. సాయంత్రం 4:00 గంటలకు సభ తిరిగిప్రారంభమైనా విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైనా.. రాహుల్ గాంధీ అనర్హత వేటుపై విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో ఛైర్మన్ సభను మంగళవారం ఉదయం 11:00 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభ సాయంత్ర 4:00 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.

ఢిల్లీ: మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం పార్లమెంట్‌ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభం కాగా మళ్లీ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. 

►విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.  లోక్‌సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈరోజు(సోమవారం) ఉదయం పార్లమెంట్‌ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

అదానీ వ్యవహారంలో రాహుల్‌ గాంధీని మాట్లాడనివ్వకుండా చేసిన తీరుపై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. ఈ మేరకు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో ఇవాళ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. 

అలాగే.. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగించనుంది. ఇవాళ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ సభ్యులు నిరసన చేపట్టనున్నారు. ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ ఎంపీలకు ఇప్పటికే ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా నల్ల దుస్తులతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు నిరసనల్లో కొందరు నల్ల దుస్తులతో కనిపించారు కూడా.  ఇదిలా ఉంటే.. ఖర్గే ఆదేశిస్తే తాము రాజీనామాలకు సైతం సిద్ధమని భువనగిరి(తెలంగాణ) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. 

ఇవాళ్టి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఉభయ సభల కాంగ్రెస్‌ సభ్యులు విడిగా సమావేశం కానున్నారని సమాచారం.

ఇదీ చదవండి: మోదీ.. అధికారం వెనుక దాక్కుంటున్నాడు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top