రాహుల్‌పై అనర్హత వేటు: కాంగ్రెస్‌ శ్రేణుల స్పందన.. నియంతృత్వ చర్యన్న ఖర్గే

Congress Party strongly Condemn Rahul Gandhi Disqualification - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎంపీగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్‌ కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే. 

ఇది నియంతృత్వ చర్య అని, బీజేపీ కుట్రలను తిప్పి కొడతామని, నిజాలు మాట్లాడితే ఎన్డీయే సర్కార్‌ ఓర్చుకోవడం లేదని ఖర్గే అన్నారు. రాహుల్‌ కోసం పోరాటం చేస్తామని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే..  ఢిల్లీలో సాయంత్రం  కాంగ్రెస్‌ అత్యవసర భేటీ కానుంది. 

మరోవైపు ఈ పరిణామంపై మరో సీనియర్‌, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  జైరాం రమేష్‌ స్పందించారు. ఈ చర్యపై మౌనంగా ఉండబోమని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారాయన. రాజకీయంగా ఎదుర్కొంటాం. మేము మౌనంగా ఊరుకునేది లేదు. అదాని హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై జేపీసీ వేయాలని కోరితే.. రాహుల్ గాంధీని  అనర్హత వేటు వేశారని మండిపడ్డారాయన. 

బీజేపీ ఆరెస్సెస్‌లు నిజాలు సహించలేకపోతున్నాయి. రాహుల్‌ గాంధీని చూసి మోదీ భయపడుతున్నారు. అందుకే రాహుల్‌ను కట్టి చేసేందుకు యత్నిస్తున్నారు అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

కేరళ వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీకి.. 2019  నాటి పరువు నష్టం దావా కేసులో నిన్న గుజరాత్‌ సూరత్‌ కోర్టు  రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో.. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం, 1951 లోని సెక్షన్‌ సెక్షన్‌ 8(3), రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(1)(e) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పాల్‌ కుమార్‌ సింగ్‌ పేరిట నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

ఏ నియంత శాశ్వతంగా అధికారంలో లేడు: రేవంత్ రెడ్డి..

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం దుర్మార్గమన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ పై వేటు వేశారని ఆరోపించారాయన. దేశంలో అప్రకటిత ఏమర్జెన్సీ  ఉంది.  మధ్యయుగం చక్రవర్తి లా మోడీ వ్యవహరిస్తున్నాడు. కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ పై పై కోర్ట్ కు వెల్లేందుకు అప్పిల్ చేసేందుకు 30 రోజుల సమయం ఇచ్చారు.. అయినా అనర్హత వేటు వేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యే. ఏ నియంత చరిత్రలో శాశ్వతంగా అధికారంలో లేడు. జోడో యాత్ర లో బీజేపీ వైఫల్యాల ను రాహుల్ గాంధీ ఎండగట్టారు. ప్రజల ముందు ఉంచారు. జోడో యాత్ర కు బీజేపీ భయపడింది. దేశం రాహుల్ గాంధీ కి అండగా ఉంటుందని రేవంత్‌ తెలిపారు.

రాహుల్‌కు జైలు శిక్ష.. అనర్హత..  ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top