రాహుల్‌ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్‌

Congress MP Rahul Gandhi disqualified as a Member of Lok Sabha - Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి షాక్‌ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్‌సభ సెక్రటేరియెట్‌. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ ప్రకటించింది.  2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేరళ వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌.

ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. 

ఏం జరిగిందంటే.. 
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్‌ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయంటూ.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ, సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు.

ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్‌ చేసింది సూరత్‌ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్‌మెంట్‌ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్‌ గాంధీ సూరత్‌ కోర్టులో హాజరయ్యారు కూడా.  

రాహుల్‌ టార్గెట్‌ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్‌ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్‌ వర్మ మాత్రం రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్‌ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్‌ గాంధీకి గురువారం రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top