కాంగ్రెస్‌ ఎంపీని చితకబాదిన గ్రామస్థులు.. కారణం ఇదే.. | Congress MP Manoj Kumar Injured At Bihar Full Details | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎంపీని చితకబాదిన గ్రామస్థులు.. కారణం ఇదే..

Jan 31 2025 7:49 AM | Updated on Jan 31 2025 10:31 AM

Congress MP Manoj Kumar Injured At Bihar Full Details

పాట్నా: బీహార్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ మనోజ్‌ కుమార్‌పై గ్రామస్థులు దాడి చేశారు. ఈ క్రమంలో ఎంపీ తలకు తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతరం, మనోజ్‌ కుమార్‌కు చికిత్స అందించిన వైద్యులు.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిపారు. ఇక, ఎంపీపై దాడి వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల ప్రకారం.. ఈ ఘటన బీహార్‌లోని కైమూర్‌ జిల్లాలో ఉన్న నాథుపుర్‌ గ్రామం సమీపంలో జరిగింది. మనోజ్ కుమార్‌ సోదరుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత ఎంపీ మనోజ్, ఆయన సోదరుడు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో మనోజ్‌ కుమార్‌కు చెందిన కారు కొందరు వ్యక్తులను తాకుతూ వెళ్లింది. ఆ సమయంలో కారులో మనోజ్‌ లేరు. దీంతో, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు డ్రైవరుపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు ఎదురు దాడి చేయడంతో ఘర్షణ తీవ్రమైంది.

 

అనంతరం, ఎంపీ అక్కడకు చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోతూ రాడ్లు, కర్రలతో ఎంపీని చితకబాదారు. దీంతో తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయమైంది. ఎంపీ బాడీగార్డు, పీఏలపైనా దాడి జరిగింది. పోలీసులకు విషయం తెలియడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎంపీని వారణాసిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement