బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్‌గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్‌తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్‌తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే
మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు.


