న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న ఢిల్లీలో చేపట్టబోయే భారీ ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బోస్టన్‌కు చెందిన ఈ పారిశ్రామికవేత్త, సోషల్ మీడియా సెలబ్రిటీ భారత్‌లో అడుగుపెట్టకముందే పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనకు ముందే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు తమ నివాసాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ ఇంటి వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
భద్రతా కారణాలతోనే ఇల్లు ఖాళీ
అభిజీత్ దిప్కే తలపెట్టిన ఢిల్లీ నిరసనపై దేశవ్యాప్తంగా పబ్లిక్ అటెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా తమ నివాసాన్ని తాత్కాలికంగా మార్చినట్లు అభిజీత్ తండ్రి భగవాన్‌రావు దిప్కే తెలిపారు. తమకు ఎలాంటి ప్రత్యక్ష బెదిరింపులు రాలేదని, కేవలం కొడుకు సామాజిక ఉద్యమంపై వస్తున్న విపరీతమైన ప్రచారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదట తన కొడుకును ఈ ప్రచారం నుండి తప్పుకోవాలని కోరినప్పటికీ, చివరకు అతని నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
విద్యా సంస్కరణల కోసమే పోరాటం
రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న 30 ఏళ్ల అభిజీత్ దిప్కే, ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 6న ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రారంభం కానున్న ఈ నిరసన మార్చ్ పూర్తిగా విద్యా రంగంలో సంస్కరణలు, జవాబుదారీతనం కోసమేనని నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తిగా చట్టబద్ధమైన పద్ధతిలోనే ఈ బహిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
పార్టీ పెట్టే ఆలోచన లేదు.. లీగల్ సపోర్ట్ సిద్ధం
ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది అసీమ్ సరోదే ఈ కార్యక్రమానికి చట్టపరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ ఉద్యమాన్ని అధికారిక రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం అభిజీత్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం చట్ట పరిధిలోనే ఈ నిరసన సాగుతుందని తెలిపారు. ఈ ఢిల్లీ ఆందోళనకు మద్దతుగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, నటుడు ప్రకాష్ రాజ్, విశ్లేషకులు విశంభర్ చౌదరి, జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే వంటి ప్రముఖులను అభిజీత్ ఆహ్వానించారు. మరోవైపు కొడుకు రాజకీయ యాక్టివిటీపై తల్లి అనిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అతను రాజకీయాల కంటే ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: కోటా: ‘నీట్’ సీటు వేటలో అనంత లోకాలకు..


