
ఢిల్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. చిత్రంలో ఉత్తమ్, సురేశ్ షెట్కార్, రఘువీర్, వంశీ, సింఘ్వీ, మల్లు రవి
‘బనకచర్ల’ను ఏపీ ప్రస్తావించలేదు.. మేం ఆపమనలేదు
ఢిల్లీలో జలశక్తి మంత్రి వద్ద భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేసేలా చేయడం, జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేలా చేయడం తెలంగాణ సాధించిన విజయం
టెలీమెట్రీ ఏర్పాటు, శ్రీశైలం మరమ్మతులకు ఏపీని ఒప్పించడం కూడా రాష్ట్రం సాధించిన విజయమే
గోదావరి బోర్డు హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు ఏపీలో ఏర్పాటు చేయాలని నిర్ణయం
పార్లమెంటులో చేసిన చట్టాలకే నిబద్ధత లేదు
కేంద్రం ఏర్పాటు చేసే కమిటీపై నమ్మకంతో ముందుకు వెళ్తాం
ఇది కేవలం అనధికార భేటీ మాత్రమే అన్న ముఖ్యమంత్రి
కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరించిందని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘బనకచర్ల ప్రాజెక్టును కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తే కదా.. మేము ఆపమంటూ అభ్యంతరం తెలిపేది..’ అని సీఎం అన్నారు. అయినా బనకచర్లపై ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు తెలియజేసిందని, ఆ ప్రాజెక్టుపై పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అభ్యంతరాలు తెలిపాయని చెప్పారు.
ఇది కేవలం అనధికార (ఇన్‌ఫార్మల్) భేటీ మాత్రమే అన్న రేవంత్‌రెడ్డి.. ఇద్దరు సీఎంలతో ఈ భేటీని నిర్వహించేలా చేయడం, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేలా చేయడం.. తెలంగాణ సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రుల సమావేశం పూర్తిగా ఇన్‌ఫార్మల్‌గానే సాగిందని, కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, కేవలం ఒక వేదికను ఏర్పాటు చేసి మధ్యవర్తిలా మాత్రమే వ్యవహరించిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారుల సమావేశం అనంతరం..రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు
‘జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. కేవలం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన ఒక అనధికార సమావేశం. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. పార్లమెంటులో చేసిన రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాల అమలు నిబద్ధతకే దిక్కు లేదు. ఏ విషయంలోనైనా నమ్మకంతో ముందుకు పోవాలి తప్ప, అనుమానించుకుంటూ పోతే ఏ సమస్యలూ పరిష్కారం కావు..’ అని ముఖ్యమంత్రి (విలేకరుల ప్రశ్నకు జవాబు) అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన టెలీమెట్రీ
‘కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలకూ అనుమానాలున్నాయి. అందుకే టెలీమెట్రీ పరికరాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎవరెన్ని నీళ్లు వాడుతున్నారోనన్న రాష్ట్రాల సందేహాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి అవసరమైతే తెలంగాణ నిధులతోనే యుద్ధ ప్రాతిపదికన అన్ని పాయింట్లలో టెలీమెట్రీ ఏర్పాటు చేస్తాం. గోదావరి బోర్డు హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీశైలం డ్యాం మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు ఏపీ అంగీకరించింది. ఈ నాలుగు అంశాలపైనే ఈసారి చర్చ సాగింది. టెలీమెట్రీ ఏర్పాటుతో పాటు శ్రీశైలం డ్యాం మరమ్మతులకు ఏపీని ఒప్పించడం కూడా రాష్ట్రం సాధించిన విజయమే. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు. కమిటీ ఏర్పాటు అయిన 30 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

కేసీఆర్ రాష్ట్ర హక్కులు ఏపీకి ధారాదత్తం చేశారు
‘గత సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయలేకపోయారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారు? కనీసం బోర్డుల కార్యాలయాలు ఎక్కడ ఉండాలో కూడా నిర్ణయించలేకపోయారు. కానీ మేము సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. మా హయాంలో పలు అంశాలు చర్చల స్థాయికి రావడం, నాలుగు అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు రావడం తెలంగాణ సాధించిన విజయం. కానీ కొందరు అధికారం కోల్పోయిన బాధతో ఈ చర్చలు సఫలమవ్వకూడదని చూస్తున్నారు..’ అని సీఎం విమర్శించారు. ఈ సమావేశంలో కేంద్రం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించిందని, జలశక్తి మంత్రి ఈ విషయంలో ఎవరి పక్షాన నిలబడకుండా ఒక న్యాయమూర్తిలా వ్యవహరించారని కితాబు ఇచ్చారు.
సమావేశం ఫలప్రదం: ఏపీ మంత్రి నిమ్మల
కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఫలప్రదమైనట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. భేటీ స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపారు.