24 గంటల్లో తేల్చాలి.. లేదంటే.. : సీఎం కేసీఆర్‌

Cm Kcr Protest Delhi Telangana Bhavan About Paddy Procurement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘హిట్లర్, నెపోలియన్, ముస్సోలినీ వంటి ఎందరో నియంతలు మట్టిలో కలిశారు..మీరెంత?’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నూకలు తినండి... పనీ పాటా లేదా అని మంత్రులతో ఎలా వ్యాఖ్యానిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి చిన్న రాష్ట్రమైన తెలంగాణలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవా..? లేక నరేంద్రమోదీకి కొనాలన్న మనసు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు కావాలి కానీ ధాన్యం వద్దా అంటూ మండిపడ్డారు.

కేంద్రంతో పోరు మొదలైందని, అంతిమ విజయం సాధించే వరకు ఈ పోరు ఆగదని చెప్పారు. వీలైనంత త్వరగా రైతుల శ్రేయస్సు కోరే రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టి దేశంలో తాము సృష్టించే భూకంపానికి పీయూష్‌ ‘గోల్‌మాల్‌’పరిగెత్తుతూ కనిపించడం తథ్యమని అన్నారు. దేశంలో జరుగబోయే రైతుల మహా సంగ్రామానికి తెలంగాణ ప్రజలు, రైతులు పూర్తి మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ తెలంగాణ భవన్‌ వేదికగా సోమవారం జరిగిన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్షలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

హృదయంలో రగులుతున్న అగ్నిజ్వాల
యావత్‌ దేశ ప్రజల హృదయాల్లో రగులుతున్న అగ్ని జ్వాల మా హృదయంలోనూ రగులుతోంది. ఈ అగ్నిజ్వాల వ్యాపించి బీజేపీని నాశనం చేసేవరకు వదలదు. ధాన్యం కొనుగోలు విషయమై వారాల పాటు కేంద్రమంత్రుల కార్యాలయాల చుట్టూ తిరిగిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలను గంటలపాటు ఎదురుచూసేలా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం నడిపించే విధానమా? 

కేంద్రం కుట్రలు ఇకపై సాగవు
తెలంగాణ ప్రభుత్వం రైతులను గంగలో ముంచేంత బలహీనమైనది కాదు. మా ప్రాణాలు పోయినా రైతులకు నష్టం రానీయబోం. వారిని కాపాడుకుంటాం. కానీ కేంద్రంలోని బీజేపీ.. రైతులతో ఏవిధంగా వ్యవహరిస్తోందన్నది దేశం మొత్తానికి తెలియాలి. ధాన్యం విషయంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గొంతెత్తితే, కుట్రపూరితంగా బీజేపీ నేతలతో హైదరాబాద్‌లో ధర్నా చేయించడం సిగ్గు చేటు. ఇలాంటి కుట్రలు దేశంలో ఇకపై సాగబోవు.

ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులేనా..?
దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్‌ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి ని అవమానిస్తున్నారు. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. బీజేపీలోని నాయకులందరూ సత్యహరిశ్చంద్రులేనా? బీజేపీలో ఒక్క నాయకుడు కూడా అవినీతిపరుడు లేడా? బీజేపీ నాయకులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగవు? ఎవరైతే కేంద్రాన్ని ప్రశ్నిస్తారో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తామంటూ మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రిని జైలుకి పంపిస్తామంటూ రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. దమ్ముంటే రండి... ఎవరు ఎవరిని పంపిస్తారో చూద్దాం. 

రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలతో చర్చిస్తా..
దేశం మొత్తం మీ వైఖరి అర్థమైపోయింది. ఇక దేశం నోర్మూసుకొని కూర్చొనే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా చేశాం.. ఇప్పుడు దేశం కోసం చేయనున్నాం. రాష్ట్రపతి ఎన్నికల గురించి విపక్ష మిత్రులతో కలిసి చర్చించేందుకు త్వరలో మళ్ళీ ఢిల్లీ వస్తా. అప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి వారితో మాట్లాడతా. 

ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం
కేంద్ర విధానాల విషయంలో అన్ని పార్టీలను ఏకం చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం కొనసాగుతుంది. దేశంలో రాకేశ్‌ టికాయత్‌ చేయబోయే మరో పోరుకు మద్దతిస్తున్నాం. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? రైతులు కన్నీళ్ళు పెట్టుకొనేలా చేసిన ప్రభుత్వం తప్పనిసరిగా కూలిపోతుంది. గద్దె దించే సత్తా రైతులకు ఉంది. ఇది దేశ రైతుల శక్తి. ప్రపంచంలో ఎక్కడా జరగనట్లుగా 13 నెలలపాటు జరిగిన రైతు ఉద్యమం కారణంగా ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రధాని క్షమాపణ కోరుతుంటారు. భవిష్యత్తులోనూ కోరతారు. 

గుజరాత్‌ రైతులు రోడ్డున పడ్డారు
దేశం మొత్తం గందరగోళంలో ఉంది. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. గుజరాత్‌ రాష్ట్ర రైతులు కరెంటు కోసం డిమాండ్‌ చేస్తూ రోడ్డున పడ్డారు, కేవలం తెలంగాణలో మాత్రమే అన్ని వర్గాల ప్రజ లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందుతోందని గర్వంగా చెప్తున్నా.

కొత్త సాగు విధానం తేవాలి...
దేశ రైతులు భిక్షగాళ్లు కాదు. హక్కులు కోరుతున్నారు. దేశంలో కొత్త వ్యవసాయ విధానం రూపొందించకుంటే అధికారం నుంచి దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలు పోరుకు బయలుదేరితే విజయం సాధించే వరకు ఆగే ప్రసక్తే లేదు.

రైతుల్ని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు
రాష్ట్రంలో పంటమార్పిడి చేయమని కేంద్రం చెబితే, రాష్ట్రంలో ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పాం. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు వరి వేయాలని, ప్రతి గింజా కేంద్రం కొంటుందంటూ రైతులను రెచ్చగొట్టారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top