రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Clashes break out between BJP workers, protesting farmers - Sakshi

ఘజియాబాద్‌: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య బుధవారం ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్‌ వద్ద ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ– మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఊరేగింపుగా వెళ్తూ, రైతుల నిరసన కేంద్రానికి దగ్గరగా వెళ్లిన సమయంలో ఈ ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కార్యకర్తలు, రైతులు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారని, ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారని వెల్లడించారు. ఘాజీపూర్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు.

బీజేపీ నేత అమిత్‌ వాల్మీకిని స్వాగతిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ ఊరేగింపు జరిపారు. రైతు ఉద్యమంపై బురదజల్లేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర ఈ దాడి అని రైతు నేతలు ఆరోపించారు. రైతులతో బీజేపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ జెండాలు పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు రైతులను అసభ్య పదజాలంతో దూషించారని భారతీయ కిసాన్‌ యూనియన నేత రాకేశ్‌ తికాయత్‌ ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలు రైతులను దూషిస్తూ రెచ్చగొట్టారు. రైతులను మోసగాళ్లని, దేశ వ్యతిరేకులని, ఖలిస్తానీలను పేర్కొంటూ నినాదాలు చేశారు. రైతుల నిరసన వేదికపై రాళ్లు విసిరారు’అని సంయుక్త కిసాన్‌ మోర్చా ఒక ప్రకటనలో వివరించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top