తెలుగువాడినైనందుకు గర్వపడుతున్నా | Sakshi
Sakshi News home page

తెలుగువాడినైనందుకు గర్వపడుతున్నా

Published Fri, Dec 24 2021 12:25 PM

CJI NV Ramana Three Days Andhra Pradesh Tour Visit Native Village - Sakshi

నేను పుట్టిన ఈ పొన్నవరం గ్రామం ఎంతో చైతన్యవంతమైనది. ఇక్కడే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. ఈ గ్రామం వల్లే నేను అన్ని విషయాల్లో చైతన్యవంతుడిగా ఉండేవాడిని. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగువారంతా ఎప్పటికీ మరువకూడదు. – సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ  

సాక్షి, అమరావతి/నందిగామ: ‘కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు.. దీనికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాను’.. అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ అన్నారు. ‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న మహాత్ముని మాటలూ అక్షర సత్యమని, ఎంత అత్యున్నత స్థాయికి ఎదిగిన వారైనా పల్లె బిడ్డలే అని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు.

పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని అన్నారు. గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానన్నారు. 

కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ 

మా ఊరు ఎంతో చైతన్యవంతమైంది
గ్రామంతో తనకున్న అనుబంధాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ సందర్భంగా  గుర్తుచేసుకున్నారు. గ్రామంలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నానని, చిన్నప్పుడు కూడా ఎప్పుడూ తాను ఎవ్వరితోనూ దెబ్బలు తినలేదని, తన పుట్టిన ఊరు ఎంతో చైతన్యవంతమైందని, ఈ గ్రామంవల్లే తాను అన్ని విషయాల్లో ఎంతో చైతన్యవంతుడిగా ఉండేవాడినన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి గ్రామంలో మూడు పార్టీలు మాత్రమే ఉండేవని, వీటివల్ల ఎప్పుడూ ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదని, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండటం తనకు సంతోషంగా ఉందన్నారు. వీరులపాడు మండలం కమ్యూనిస్టులకు కంచుకోట అని, తన తండ్రి కూడా కమ్యూనిస్టు మద్దతుదారుగా ఉండే వారన్నారు. తనకు రాజకీయాలపట్ల కూడా ఎంతో ఆసక్తి ఉండేదని, అప్పట్లో స్వతంత్ర పార్టీకి మద్దతిచ్చానని సీజేఐ గుర్తుచేసుకున్నారు. మెట్ట ప్రాంతం కావడంతో అప్పట్లో ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని.. కానీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో ఆ సమస్య కొంతమేర పరిష్కారమైందన్నారు. దేశమంతా అభివృద్ధి పథంలో సాగుతున్న రోజుల్లో సైతం రాజకీయంగా ఎంతో చైతన్యవంతంగా ఉన్న తన ప్రాంతం ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందకపోవడం తనను బాధించిందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలంతా ఐక్యంగా ఉండి వాటిని పరిష్కరించుకోవడానికి నడుం బిగించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. 

తెలుగు జాతి ఔన్నత్యాన్ని మరువకూడదు
తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగువారు ఎప్పటికీ మరువకూడదని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా, తెలుగు జాతి గొప్పదనాన్ని పలువురు చెబుతుండటం మనకు గర్వకారణమన్నారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఎల్లవేళలా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తయారుచేసిన భారత్‌ బయోటెక్‌ తెలుగు వారిది కావడం గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మన తెలుగు వారే అనేక నిర్మాణ సంస్థలు స్థాపించారని.. ఉగ్రవాదులకు భయపడకుండా ఆఫ్గానిస్తాన్‌ పార్లమెంట్‌ను నిర్మించిన ఘనత మన తెలుగువారిదేనన్నారు. తెలుగు ప్రజల ప్రతిష్టకు ఏ మాత్రం భంగం కలగకుండా తాను ప్రవర్తిస్తానని కూడా హమీ ఇస్తున్నానని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు.

తెలుగు జాతికి గర్వకారణం : మంత్రి పెద్దిరెడ్డి
సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ అత్యున్న న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. పట్టుదల, కృషి, అకుంఠిత దీక్షవల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే తత్వం సీజే సొంతమని, దానిని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలన్నారు. ఒక తెలుగు వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం యావత్‌ తెలుగు వారు గర్వపడాల్సిన విషయమన్నారు.

దేశానికే వన్నెతెచ్చే విధంగా ఆయన పనిచేస్తారని, ఇటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, సత్యనారాయణమూర్తి, మానవేంద్రరాయ్, బట్టు దేవానంద్, లలితకుమారి, కృషమోహన్, జయసూర్య, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు, వసంత కృష్ణప్రసాద్, భూమన కరుణాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్‌ జె. నివాస్, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: (ఆ సినిమాలకు పెట్టిన ఖర్చెంత.. పవన్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత? 

Advertisement
Advertisement