రాజ్యాంగమే సుప్రీం | CJI BR Gavai has said the Constitution of India is supreme | Sakshi
Sakshi News home page

రాజ్యాంగమే సుప్రీం

Jun 27 2025 1:07 AM | Updated on Jun 27 2025 1:07 AM

CJI BR Gavai has said the Constitution of India is supreme

మూడు ప్రజాస్వామ్య విభాగాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి  

సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

అమరావతి(మహారాష్ట్ర): దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం మాత్రం లేదని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. 

52వ సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ గత నెలలో ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయనను తాజాగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ అత్యున్నతమని కొందరు చెబుతుంటారని, కానీ, తన ఉద్దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టంచేశారు. 

అలాగే ప్రజాస్వామ్యంలో శాసన, కార్వనిర్వాహక, న్యాయ విభాగాల్లో ఏది అత్యున్నతం అనే చర్చ కూడా సాగుతోందని, నిజానికి రాజ్యాంగం పరిధిలోనే ఈ మూడు విభాగాలూ పనిచేయాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉన్నంత మాత్రాన ఒక న్యాయమూర్తి తనను తాను స్వతంత్రుడిగా భావించుకోవడానికి వీల్లేదన్నారు. పౌరుల హక్కులను, రాజ్యాంగ విలువలను, సూత్రాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉందని, అది అతడి విద్యుక్త ధర్మమని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement