కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్‌

China preparing for war but Centre is sleeping says Rahul Gandhi - Sakshi

జైపూర్‌: చైనా మన మీదకి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత్‌ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చైనా నుంచి మనకు ముప్పు ఉందని రెండు, మూడేళ్లుగా నాకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. కానీ కేంద్రం దాన్ని దాచి పెడుతూ పట్టనట్టు వ్యవహరిస్తోంది.

2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. 20 మంది సైనికుల ప్రాణాలు తీసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మన జవాన్లను కొట్టింది. లద్దాఖ్, తవాంగ్‌లో ఘర్షణలు జరిగాయి. ఇన్ని జరిగినా మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోంది’’ అంటూ ధ్వజమెత్తారు. చైనా ఆయుధ సంపత్తి, వాటిని నియోగిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు.

బీజేపీని ఓడించేది మేమే
కాంగ్రెస్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, ఎప్పటికైనా బీజేపీని ఓడించేది తమ పార్టీయేనని రాహుల్‌ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పనైపోయిందంటున్నారు. కానీ బీజేపీ ఎప్పటికైనా కాంగ్రెస్‌ చేతిలోనే ఓడుతుంది. కాంగ్రెస్‌కు కోట్లాది మంది కార్యకర్తల బలముంది. వారి సేవల్ని పూర్తిగా వినియోగించుకుంటే రాజస్థాన్‌లో అఖండ విజయం ఖాయం’’ అన్నారు. కాంగ్రెస్‌ నుంచి నేతల నిష్క్రమణను మీడియా ప్రస్తావించగా, ‘పోయేవాళ్లందరినీ పోనిస్తాం. కాంగ్రెస్‌పై నమ్మకమున్న వాళ్లే మాతో ఉంటారు’’ అన్నారు.

బీజేపీకి బీ టీమ్‌ ఆప్‌
ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ–టీమ్‌గా మారిందని రాహుల్‌ ఆరోపించారు. ఆప్‌ లేకుంటే గుజరాత్‌ ఎన్నికల్లో గెలిచే వాళ్లమన్నారు. ‘‘ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్ఫథం లేదు. దేశానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. వచ్చే ఎన్నికల్లో ఇతర విపక్షాలతో కలిసి పని చేస్తాం. మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు’’ అన్నారు. హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ తదితరులు రాహుల్‌తో కలిసి నడిచారు.

‘నెహ్రూ భారత్‌’ కాదిది: బీజేపీ
న్యూఢిల్లీ: చైనా యుద్ధానికి వస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందన్న రాహుల్‌ వ్యాఖ్యలను బీజేపీ తిప్పి కొట్టింన్నిలాంటి మాటలతో సైనికుల స్థైర్యాన్ని రాహుల్‌ దెబ్బ తీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ విమర్శించారు. ‘‘1962లో మనపై చైనా యుద్ధానికి కాలుదు వ్వినప్పటి నెహ్రూ కాలపు భారత్‌ కాదిది. మోదీ నేతృత్వంలోని కొత్త నవీన భారత్‌. కయ్యానికి కాలు దువ్వే వాళ్లకు గట్టిగా జవాబిస్తాం’’ అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top