డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ | Chief Minister DK Shivakumar Take Oath Inside Congress Karnataka Transition Plan | Sakshi
Sakshi News home page

డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ

May 27 2026 3:40 PM | Updated on May 27 2026 3:49 PM

Chief Minister DK Shivakumar Take Oath Inside Congress Karnataka Transition Plan

కర్ణాటకలో అధికార మార్పిడి, ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే రాజకీయ పరిణామాలు మళ్లీ  ఊపందుకున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో డీకే శివకుమార్‌ సీఎం పదవిని స్వీకరించేది ఎపుడు అనేది ఉత్కంఠగా మారింది.

‘‘మంచి రోజులు వస్తాయి," అని తన పదోన్నతి గురించిన వార్తలపై గతవారం ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ చమత్కరించారు. ఇప్పుడు, కర్ణాటక అధికార మార్పిడి దాదాపు ఖరారు కావడంతో, ఆయన అనుకున్న సమయం రానే వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రశ్న... ఇది ఎప్పుడు జరుగుతుంది?

2023 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితిలో సగం గడువు (రెండున్నరేళ్లు) ముగియడంతో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు సీఎం పీఠాన్ని అప్పగించేందుకు హైకమాండ్ పచ్చజెండా ఊపింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రెండు రకాల అవకాశాలు కనిపిస్తున్నాయి.

తక్షణమే? జూన్‌ 18?

అందులో మొదటిది  సిద్ధరామయ్య గురువారం (మే 28) లేదా శుక్రవారం లోపు తన రాజీనామాను సమర్పించవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారాంతంలోనే (శని లేదా ఆదివారం) డి.కె. శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

రెండోది అంశం విషయానికి వస్తే ఒకవేళ సిద్ధరామయ్య రాజీనామాను  కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తే, రాబోయే రాజ్యసభ ఎన్నికల (జూన్ 18) వరకు ఈ ప్రక్రియ ఆగవచ్చు. అంతర్గత విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపకూడదని హైకమాండ్ భావిస్తే, జూన్ 18 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది. 

సిద్ధపరామయ్య పదవీ త్యాగానికి హైకమాండ్‌ ఇచ్చిన ఆఫర్‌ ఏంటి అనేది కూడా చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల నుండి సిద్ధరామయ్యను గౌరవప్రదంగా సాగనంపడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు భారీ ఆఫర్లనే ప్రకటించినట్టు సమాచారం. ఇందులో రాజ్యసభ సీటు, ఢిల్లీ రాజకీయాల్లో ప్రాధాన్యతఅనే అంశాలు కీలకంగా మారనున్నాయి.  

జూన్ 18న జరిగే ఎన్నికల్లో సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు, ఏఐసీసీ (AICC) లో కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు, కొత్తగా ఏర్పడే  డీకే శివకుమార్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యత కల్పించడం.  అయితే సిద్ధరామయ్య వర్గం ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎం పదవులను డిమాండ్ చేస్తోంది. అయితే శివకుమార్ మాత్రం కేవలం ఒక్క డిప్యూటీ సీఎం పదవికి మాత్రమే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇన్ని అంచనాల నడుమ  డీకే క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొనగా, సంబరాలు వెల్లివిరుస్తుండగా, సిద్దరామయ్య మాత్రం ఇంకా తన వ్యూహాలను గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం.

గురువారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
బుధవారం బెంగళూరుకు చేరుకున్న తర్వాత, ఢిల్లీ సమావేశాలు, అధికార మార్పిడి వార్తలపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. విలేకరుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఏకైక సమాధానం, "నేను రేపు(గురువారం) మాట్లాడతాను." అని. గురువారం ఉదయం అల్పాహారం కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్యను కలవనున్నారు. ఇడ్లీ, సాంబార్, వడలతో పాటు ముఖ్యమంత్రి శివకుమార్‌కు మరో తీపి కబురు అందిస్తారా లేక  ఈ ఇడ్లీ, సాంబార్, వడల చర్చల తర్వాత సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా, లేక మరికొంత కాలం ట్విస్ట్ ఇస్తారా అనేది వేచి చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement