చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: ఎవరీ హిడ్మా

Chhattisgarh Encounter Maoist Leader Hidma Behind The Ambush of 22 Soldiers - Sakshi

మావోయిస్టుల కాల్పుల ఘటనలో 24కు చేరిన మృతుల సంఖ్య

హిడ్మాపై రూ. 50 లక్షల రివార్డు ప్రకటించిన మూడు రాష్ట్ర ప్రభుత్వాలు

సుప్రీం మెంబర్‌ సెంట్రల్‌ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్‌ ఘటనకు ప్రధాన సూత్రధారైన హిడ్మాపై తెలంగాణ, చత్తీసగఢ్‌, ఒడిశా ప్రభుత్వాలు 50 లక్షల రివార్డు ప్రకటించాయి. ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మహిళా మావోయిస్టును మడివి. వనజగా గుర్తించారు. ఆమె వద్ద నుంచి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఇన్సాస్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.

తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. అతడిని పట్టుకునేందకు వెళ్లిన దళాలు అతడి వ్యూహంలో చిక్కుకున్నాయి. అనంతరం భద్రతా దళాలను హిడ్మా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. గతంలో కసాపాల్‌, మినపా ఘటనలకు హిడ్మానే నాయత్వం వహించాడు. 

ఎవరీ హిడ్మా..
హిడ్మా అలియాస్‌ హిడ్మాన్న(40) సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరిజనుడు. 90వ దశకంలో తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్ నంబర్1కి నాయకత్వం వహిస్తున్నాడు. భయంకరమైన, ఘోరమైన ఆకస్మిక దాడులు చేయడంలో హిడ్మా దిట్ట. ప్రస్తుతం మహిళలతో సహా 180-250 మంది మావోయిస్టుల దళానికి అతడు నాయకత్వం వహిస్తున్నాడు. దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీలో (డీకేఎస్‌జడ్‌) లోనే కాక సీపీఐ(ఎం) 21 సుప్రీం మెంబర్‌ సెంట్రల్‌ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అతడిని సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా నియమించినట్లు తెలిసింది. భీమ్‌ మాండవి హత్యా నేరంలో ఎన్‌ఐఏ హిడ్మాపై చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేసింది. 

ఎలా దాడి చేస్తారంటే..
ప్రతి ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో మావోయిస్టులు భద్రతా దళాలను టార్గెట్‌ చేసుకుని వ్యూహాత్మక ఎదురు దాడి (కౌంటర్‌ ఆఫెన్సివ్‌ కాంపెయిన్‌(టీసీఓసీ) అంబుష్‌ ఆపరేషన్‌ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం)లను నిర్వహిస్తారు. ఈ కాలాన్నే ఎందుకు ఎన్నుకుంటారంటే.. ఈ సీజన్‌లో చెట్లు ఆకులు రాలి మోడులుగా మారడంతో భద్రతా దళాల కదలికలు బాగా కనిపిస్తాయి. అందుకే మావోయిస్టులు ఎక్కువగా ఈ సీజన్‌లో ఎదురుదాడులకు దిగుతారు. 

నేడు చత్తీస్‌గఢ్‌కు అమిత్‌ షా..
మావోయిస్టుల దాడుల నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఉ.10.30 గంటలకు జగదల్పూర్‌కు వెళ్లి.. అమరులైన జవాన్లకు అమిత్‌ షా నివాళులర్పించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశం అయ్యి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం అమిత్‌ షా రాయ్‌పూర్‌లో చికిత్సపొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు.

చదవండి: మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top