డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్‌ జర్నీతో భారత్‌లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్‌ ఎందుకంటే..

Cheetahs to return to India after 70 years From Namibia - Sakshi

దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చీతాల మెరుపు కదలికల్ని దేశంలో చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువస్తున్నారు. ప్రధాని మోదీ తన పుట్టిన రోజునాడు మధ్యప్రదేశ్‌లోని కునో–పాల్‌పూర్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి  చీతాలను విడుదల చేస్తారు.

రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. నమీబియా రాజధాని విండ్‌హెక్‌ నుంచి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానం బయల్దేరి రాజస్తాన్‌లోని జైపూర్‌కి శనివారం ఉదయం చేరుకుంటుంది. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌కి తరలిస్తారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు.  దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్‌ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.   

చీతాల క్షేమమే లక్ష్యంగా  
ప్రయాణంలో చీతాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు జంతువులకి కడుపులో తిప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాటికి ఆహారం ఇవ్వకుండా ఖాళీ కడుపుతో తీసుకువస్తారు. విమానంలో చీతాలను ఉంచడానికి 114సెం.మీ గీ8సెం.మీ గీ84సెం.మీ బోనుల్ని ఏర్పాటు చేశారు. ప్రయాణంలో చీతాల బాగోగుల్ని చూడడానికి ముగ్గురు సంరక్షకులు వెంట ఉంటారు.

ప్రత్యేక శ్రద్ధ
వన్యప్రాణుల్ని ఖండాంతరాలకు తరలించాల్సి వస్తే ప్రయాణానికి ముందు తర్వాత నెల రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి. ఆ నిబంధనలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చెప్పారు. కునో జాతీయ పార్కులో చీతాలను ఉంచడానికి భారీ ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేశారు. చీతాల నుంచి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా ఇప్పటికే వాటికి వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

క్వారంటైన్‌ సమయం పూర్తయ్యాక కొత్త వాతావరణానికి చీతాలు అలవాటు పడడం కోసం కొన్నాళ్లు అవి స్వేచ్ఛగా విహరించడానికి వీలుగా వదిలేస్తారు. అందుకే కునో నేషనల్‌ పార్కు చుట్టుపక్కల ఉన్న 24 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించారు.  నమీబియాలో వాతావరణానికి దగ్గరగా కునో పార్క్‌ ఉంటుంది. అందుకే అక్కడే వాటిని ఉంచాలని నిర్ణయించారు.          
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top