ఇద్దరు అధికారులతో సాంకేతిక కమిటీ ఏర్పాటు
టెండర్ రద్దు సహా పలు అంశాలపై దర్యాప్తుకు ఆదేశం
మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్ర బొగ్గు శాఖ
నా ఆదేశాలతోనే కమిటీ ఏర్పాటు: మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని నైని బొగ్గు క్షేత్రానికి సంబంధించిన టెండర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్‌రాజ్ నయన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తన ఆదేశాల మేరకే ఈ కమిటీ ఏర్పాటైనట్లు ఆ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ (టీ/ఎన్‌ఏ) మరపల్లి వెంకటేశ్వర్లుతో కూడిన కమిటీ ఈ విచారణ జరపనుంది. గనిని అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహించే సంస్థ (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎంఓడీ)ను ఎంపిక చేయడానికి సంబంధించి 2025 నవంబర్ 28న జారీ చేసిన టెండర్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న అంశంపై ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది.
ఈ టెండర్ నోటీసు (ఎన్‌ఐటీ)లోని నిబంధనలు, విధానాల అమలు, టెండర్ ప్రక్రియలో తలెత్తిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. టెండర్ రద్దుకు గల కారణాలను స్పష్టంగా గుర్తించనుంది.
ఇతర సంస్థలతో పోల్చి అధ్యయనం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) టెండర్ విధానాలను, కోల్ ఇండియా సహా ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న ఎండీఓ, అవుట్ సోర్సింగ్ విధానాలతో పోల్చి కమిటీ అధ్యయనం చేయనుంది.
అలాగే నైని కోల్ బ్లాక్‌కు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ఖర్చులు చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? వ్యయ పరిమాణం సరైనదేనా? అన్న అంశాలపైనా కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వెంటనే సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, మూడు రోజుల్లో కేంద్ర బొగ్గు శాఖకు నివేదిక సమరి్పంచాలని బొగ్గు శాఖ ఆదేశించింది.
12 ఏళ్ల సింగరేణి స్థితిపై సీబీఐ విచారణ కోరాలి
» నైనీ కోల్‌బ్లాక్స్ వేలం నిర్వహించలేకపోతే కేంద్రానికి అప్పగించండి
» పారదర్శకంగా వేలం నిర్వహించి సింగరేణికి కేటాయించేందుకు సిద్ధం
» బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ కమీషన్లకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయి
» కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి సంస్థ విషయంలో ఏం జరిగిందో పూర్తిస్థాయి విచారణ జరగాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి (12 ఏళ్ల వ్యవహారంపై) విచారణ కోరుతూ సీబీఐకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నైనీ కోల్‌బ్లాక్స్ వేలం నిర్వహించలేకపోతే, ఒకవేళ కేంద్రానికి అప్పగిస్తే పారదర్శకంగా వేలం నిర్వహించి సింగరేణికి కేటాయించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
నాటి బీఆర్‌ఎస్ సర్కార్ సింగరేణిలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే, దానినే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ కమీషన్లకు అవినీతి, అక్రమాలకు పాల్పడితే, దాని మూల్యాన్ని సింగరేణి కారి్మకులు చెల్లించాల్సి వస్తోందన్నారు. ‘2015లో కేంద్ర ప్రభుత్వం నైనీకోల్ బ్లాక్‌ను క్యాప్టివ్ మైన్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించింది.
సహజంగా ఆ మైనింగ్ పనులు సింగరేణితోనే చేయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా మేం చేయలేము అని సింగరేణితో లేఖ రాయించి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేసింది. ఒక్క కాప్టివ్ మైన్ రాష్ట్రానికి అప్పగిస్తే గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని తప్పటడుగులు వేస్తున్నాయో చూస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ టెండర్ విషయంలో 17 కంపెనీలు సైట్ విజిట్ చేశాయి. టెండర్ దాఖలుకు ఈ నెల 29 వరకు టైమ్ ఉంది. 2015లో టెండర్లు పిలిచినా రద్దు చేశారు.
సింగరేణికి ఇవ్వకుండా బలవంతంగా లేఖ రాయించి. ప్రైవేట్ వ్యక్తులకు గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత రద్దు చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సర్కార్ టెండర్లు పిలిచి రద్దు చేసింది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన చోట ప్రాజెక్ట్ అథారిటీ అని పెట్టారు. ఇప్పటివరకు ఒక్కరికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. నైనీ కోల్‌బ్లాక్ సింగరేణికి రాకుండా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే ప్రయత్నం చేశారు. తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇస్తే గతంలో కూడా బలవంతంగా సింగరేణితో లేఖ రాయించి 25 ఏళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. ఈ రెండు ప్రభుత్వాలు పోటీపడి సింగరేణిని కష్టాల్లో పడేశాయి’అని కిషన్‌రెడ్డి తెలిపారు.


