శ్రీలంకకు భారీ సాయం.. అనుమతినిచ్చిన కేంద్రం

Centre Accepts Tamil Nadu Request To Send Aid To Sri Lanka - Sakshi

రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులు సిద్ధం

సాక్షి, చెన్నై: తీవ్రమైన ఆర్థిక ఒడిదొడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని అసెంబ్లీలో ఇటీవల చేసిన తీర్మానాన్ని అనుసరించి సీఎం స్టాలిన్‌ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు సహాయకాలను పంపనున్నట్లు వెల్లడించారు.  

అకాశ్నానంటుతున్న ధరలు 
శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం వల్ల అత్యవసర, నిత్యావసర వస్తువులకు గిరాకీ ఏర్పడింది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక పెట్రోలియం ఉత్పత్తుల పరిస్థితి దుర్భరంగా మారింది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్‌ కొనుగోలుకు గంటల తరబడి ప్రజలు క్యూలో ఉంటున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ దొరకడం గగనమైంది. దేశమంతా విద్యుత్‌ కోతలతో అల్లాడుతోంది. విద్యుత్‌ లేని కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూసివేస్తున్నారు. ఈ దశలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్‌ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తున్నాయి.

ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం సైతం శ్రీలంక దేశానికి అత్యవసర వస్తువులను, ఆహార పదార్థాలు, మందులను అందజేయాలని సంకల్పించింది. అయితే నేరుగా శ్రీలంకకే పంపే అవకాశం లేనందున కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ద్వారా కేంద్రానికి పంపింది. అలాగే సీఎం స్టాలిన్‌ గతనెల 29వ తేదీన ప్రధాని మోదీకి లేఖ రాయగా కేంద్రం నుంచి అనుమతి లభించింది. దీంతో విదేశాంగ మంత్రి జయశంకర్‌కు సీఎం పూర్తి వివరాలతో కూడిన లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లును ప్రారంభించింది.

40 టన్నుల బియ్యం, 50 టన్నుల పాలపౌడర్, ప్రాణరక్షణకు ఉపయోగపడే రూ.28 కోట్ల విలువైన 137 రకాల మందులు సిద్ధం చేసింది. సుమారు రూ.123 కోట్ల విలువైన ఈ సరుకులను ఢిల్లీకి చేరవేసి అక్కడి నుంచి శ్రీలంకకు పంపడమా లేక చెన్నై నుంచి శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి చేర్చడమా అనే అంశంపై కేంద్రం నుంచి సమాచారం అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ సోమవారం చెన్నైలోని సచివాలయంలో ఉన్నతా«ధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సాయానికి అనుమతించిన కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు.  

ఈస్ట్‌ కోస్టు రోడ్డుకు కరుణానిధి పేరు  
చెన్నై నుంచి మహాబలిపురం వరకున్న ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు (ఈసీఆర్‌)కు ‘ముత్తమిళరింజ్ఞర్‌ కలైంజ్ఞర్‌ కరుణానిధి రోడ్డు’ అని పేరుపెడుతున్నట్లు సీఎం స్టాలిన్‌ తెలిపారు. రహదారులశాఖ 75వ వసంతోత్సవాలు చెన్నై గిండీలోని రహదారుల పరిశోధనా కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ, ఈ వసంతోత్సవాలను కేవలం వేడుకతో సరిపెట్టకుండా రోడ్లకు సంబంధించి అనేక అభివృద్ధి పథకాలకు నాందీవాచకం పలుతున్నట్లు చెప్పారు. ఈ పథకాలన్నీ రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక్కడి పరిశోధనా  కేంద్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.

అధికారంలో ఉన్నా లేకున్నా తమిళుల కోసం గళం విప్పేది, అండగా నిలిచేది డీఎంకే మాత్రమేనని సీఎం స్టాలిన్‌ చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన సుమారు 3 వేల మంది స్టాలిన్‌ సమక్షంలో డీఎంకేలో చేరారు. చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా స్టాలిన్‌ మాట్లాడుతూ, డీఎంకే 73 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, మరో రెండేళ్లలో 75వ వసంతాలను జరుపుకోనుందని అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చి అన్నాదురై ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వంలో ప్రధానపాత్ర పోషించిన కరుణానిధి వల్లే ఈ రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు కూడా పెట్టారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top