1989 నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు అరెస్ట్
న్యూఢిల్లీ: 1989లో అప్పటి కేంద్ర హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా కిడ్నాప్ కేసులో కుట్రధారుగా భావిస్తున్న షఫత్ అహ్మద్ షంగ్లూను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. నిషేధిత జేకేఎల్‌ఎఫ్‌తో ప్రమేయమున్న ఈ కిడ్నాప్ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తాజాగా పట్టుబడిన షంగ్లూ జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌కు సన్నిహితుడు. రుబయ్యా సయీద్ కిడ్నాప్‌కు షంగ్లూ, యాసిన్ మాలిక్ కలిసి కుట్ర పన్నారు.
35 ఏళ్లుగా ఇతడు తప్పించుకు తిరుగుతున్నాడు. వీరిపై రణ్‌బీర్ పీనల్ కోడ్‌తోపాటు 1989నాటి టాడా చట్టం కింద కేసులున్నాయని సీబీఐ తెలిపింది. షంగ్లూ తలపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉందని పేర్కొంది. ఇతడిని జమ్మూలోని టాడా కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించింది. జేకేఎల్‌ఎఫ్ ఆర్థిక వ్యవహారాలన్నీ షంగ్లూ యాజమాన్యంలోనే సాగేవని అధికారులు చెప్పారు.
శ్రీనగర్‌లోని నిషాత్ ప్రాంతంలోని తన నివాసంలో ఉన్న షంగ్లూను సీబీఐ, కశీ్మర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారని వివరించారు. జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ 2019 నుంచి తిహార్ జైలులో ఉండటం తెల్సిందే. రుబయ్యా సయీద్‌ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. జైలులో ఉన్న ఐదుగు రు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, అప్పట్లో బీజేపీ మద్దతుతో కేంద్రంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం అందుకు తలొగ్గడంతో కథ సుఖాంతమైంది.


