హైదరాబాద్‌ పబ్‌లో కిలాడీ స్కెచ్‌ | Woman Arrested In Hyderabad Jewelry Store Employee Kidnapping Case, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పబ్‌లో కిలాడీ స్కెచ్‌.. భర్త బ్లాక్‌మెయిలింగ్‌తో బెంబేలెత్తిపోయి..

Aug 1 2025 7:29 AM | Updated on Aug 1 2025 10:13 AM

Hyderabad: Woman Arrested In Jewelry Store Employee Kidnapping Case

హైదరాబాద్‌: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్‌ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. 

అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని తిబారుమల్‌ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌లో బార్‌ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది.

గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్‌  తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు.  పథకం ప్రకారం డింపుల్‌యాదవ్‌ డ్యాన్స్‌ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అయితే.. 

అప్పటికే పథకంలో భాగంగా డింపుల్‌ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్,  డింపుల్‌ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. 

సచిన్‌ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్‌ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, 

ఉదయం 6 గంటల సమయంలో  సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్‌ భార్యకు ఫోన్‌ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు  ఉన్నాయని బెదిరించడమే కాకుండా,  రూ.10 లక్షలు ఇవ్వాలని  డిమాండ్‌ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్‌మెయిల్‌ చేశారు.

అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్‌ వద్ద విచారణ చేపట్టి బార్‌ డ్యాన్సర్‌ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.

పథకం ప్రకారమే.. 
కూకట్‌పల్లిలోని కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌లో బార్‌ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌ యాదవ్‌ భర్త పవన్‌కుమార్‌యాదవ్‌ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్‌ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను  పోలీసులు అరెస్టు చేశారు.

కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్‌ ఎయిమ్స్‌ బీబీనగర్‌ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది.  నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్‌ నుంచి  నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్‌ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బ్లాక్‌ మెయిల్‌ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement