breaking news
Jewelry store
-
హైదరాబాద్ పబ్‌లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన సచిన్‌దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్‌లకు వెళ్లే అతడికి కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్‌యాదవ్‌తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్‌దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్‌ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్‌లో పబ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్‌యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్‌ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్‌ను తాను బైక్‌పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్‌కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్‌ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్‌డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్‌ను అత్తాపూర్‌లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్‌పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్‌కుమార్‌యాదవ్ గతంలో అదే పబ్‌లో బౌన్సర్‌గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్‌ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్‌తో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్‌నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్‌లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జ్యువెలరీ షాపులో భారీ చోరీ..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని జ్యువెలరీ షాపులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారు జామున రూ.21.30 లక్షల విలువైన 1.2 కేజీల బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాపు యాజమాని డ్రైవర్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి డ్రైవర్ చోరీకి స్కెచ్ వేసినట్లు నిర్థారించారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
నగల దుకాణంలో భారీ చోరీ
తిరుపతి క్రైం: నగరంలోని చిన్నబజారు వీధిలో ఉన్న లావణ్య నగల దుకాణంలో శనివారం భారీ చోరీ జరగింది. క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం మేరకు.. చిన్నబజారు వీధిలోని లావణ్య జ్యువెలరీస్‌ను హేమంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అతను షాపు వెనుకవైపే నివాసముంటున్నాడు. శుక్రవారం దుకాణం మూసి వెళ్లి శనివారం ఉదయం తెరిచాడు. రెండు కేజీల బంగారు, రూ.35 వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. దుకాణంలో సీసీ కెమెరాలు లేవు. ప్రదర్శనకు ఏర్పాటు చేసిన నగలు అలాగే ఉన్నాయి. వస్తువులు కూడా చిందరవందర కాలేదు. దీంతో పోలీసులు కొత్తకోణంలో విచారించారు. దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి శుక్రవారం యజమాని ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. ఆ సమయంలో దుకాణంలోకి వెళ్లి చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావించి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనిపై కేసు పరిశీలించి కేసు నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీతో సీఐలు అబ్బన్న, శరత్ చంద్ర పరిశీలించారు. -
గన్నవరంలో నగల దుకాణం లూటీ
గన్నవరం: ప్రజలంతా ఓ పక్క సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో మునిగి తేలుతుంటే మరో పక్క దొంగలు ఎంచక్కా తమ పని కానిచ్చేశారు. ఐదు రోజుల కిందట గన్నవరంలో జరిగిన చోరీ ఘటన మరువక ముందే మరలా దొంగలు రెచ్చిపోయారు. గన్నవరంలోని దావాజిగూడెం రోడ్డులో ఉన్న ఓ నగల దుకాణాన్ని లూటీ చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.9 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించినట్లు దుకాణ యజమాని టి. శ్రీనివాసరావు తెలిపారు. విద్యానగర్‌లో నివసిస్తున్న శ్రీనివాసరావు దావాజిగూడెం రోడ్డులోని షాపింగ్ కాంప్లెక్స్‌లో శ్రీసాయి శ్రీనివాస జ్యూయలర్స్ నడుపుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల కిందట దుకాణం మూసివేసి కుటుంబ సమేతంగా స్వగ్రామమైన హనుమాన్‌జంక్షన్ వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగివచ్చిన శ్రీనివాసరావు దుకాణం తెరిచి చూడగా పైకప్పు రేకులు పగులకొట్టి ఉంది. దీంతో పాటు షాపులోని వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీఐ కె. శ్రీధర్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దుకాణాన్ని పరిశీలించి శ్రీనివాసరావు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. షాపులో విక్రయానికి సిద్ధంగా ఉన్న సుమారు 150 గ్రాముల బంగారు అభరణాలు, మరో 12 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దుకాణం మూసివేసిన మూడు రోజుల కాలంలో ఈ చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దుకాణదారుడితో పాటు వెనుక భవనంలో నివసిస్తున్న కాంప్లెక్స్ యజమానులు ఊళ్లో లేకపోవడమే అదునుగా భావించిన దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారని అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాగ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. వ్యాపార దుకాణలే లక్ష్యంగా... వారం రోజులుగా పట్టణంలో వ్యాపార దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఐదు రోజుల కిందట బుద్దవరం బస్టాఫ్ వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి దొంగలు చొరబడి సుమారు రూ. 54 వేలు సొత్తును అపహరించుకుపోయారు. ఈ ఘటన మరువక ముందే దావాజిగూడెంలోని నగలు దుకాణంలో చోరీ జరగడం వ్యాపార వర్గాలను ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా చోరీల నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
నగల దుకాణంలో భారీ చోరీ
* 7 కిలోల వెండి ఆభరణాలు,రూ.80 వేల నగదు అపహరణ * సీసీ టీవీలో దృశ్యాలు నమోదు * తాండూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన తాండూరు: పట్టణంలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఓ దుండగుడు 7 కిలోల వెండి నగలతో పాటు రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంగా జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. అర్బన్ ఎస్ఐ అభినవ చతుర్వేది కథనం ప్రకారం.. తాండూరు పట్టణంలోని ‘బాలాజీ బ్రదర్స్’ కాంప్లెక్స్‌లో నగల, బట్టల దుకాణం నడుస్తున్నాయి. వాటి యజమాని గోపాలకృష్ణ ఈనెల 1న రాత్రి తాండూరు మండలంలోని దస్తగిరిపేటలోని శ్రీదేవి,భూదేవి కల్యాణోత్సవానికి కుటుంబీకులతో సహా హాజరయ్యాడు. దుకాణాన్ని సిబ్బంది రాత్రి 9 గంటలకు మూసివేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిబ్బంది రఘు షాపు తెరిచాడు. దుకాణంలోని వెండి, బంగారు నగలున్న గది తలుపు తీసి ఉండటం, లోపల నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని అనుమానించి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని భావించి వెంటనే యజమాని గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చాడు. అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ అభినవ చతుర్వేది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుకాణం వెనుక భాగంలోని డ్రైనేజీ పైపుల ద్వారా దుండగుడు పాకుతూ దుకాణం ఉన్న రెండు అంతస్తుల భవనం పైకి ఎక్కాడు. పై అంతస్తులోని రేకుల షెడ్‌ను ధ్వంసం చేశాడు. ఇనుప తలుపును వంచి బట్టల దుకాణం ఉన్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మూడు గ్రిల్స్లకున్న తాళాలు విరగ్గొట్టి మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. రాత్రి 1:30 గంటల సమయంలో నగల దుకాణం గది వద్దకు వెళ్లాడు. అక్కడ అద్దాల తలుపునకున్న తాళం పగులకొట్టి లోపలికి వెళ్లాడు. సీసీ టీవీలో దుండగుడి కదలికలు నమోదయ్యాయి. నిందితుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి, చేతిలో టార్చిలైట్ పట్టుకున్నాడు. మొత్తం 7 కిలోల వెండి నగలతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.80వేల నగదును అహపరించి ఓ బ్యాగ్‌లో వేసుకొని పరారయ్యాడు. కాగా దుండగుడు లాకర్లో ఉన్న బంగారు ఆభరణాల జోలికి వెళ్లలేదు. చోరీ జరిగిన విధానం చూస్తే దుండగుడు దుకాణంలో ముందే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని, అతడు ప్రొఫెషనల్ దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ ఘటనపై తమ సిబ్బందిపై అనుమానం లేదని యజమాని గోపాలకృష్ణ చెప్పాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ సమయంలో దుండగుడు తాగి పడేసిన నీళ్ల ప్యాకెట్లు, వండ్రంగి పనులకు ఉపయోగించే బాడ్షా పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ముంబైలో భారీగా బంగారం చోరీ
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ఎప్పుడూ ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. పైగా పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉంది. అయినా దొంగలు పట్టపగలే ఓ నగల దుకాణంలో సుమారు ఎనిమిదిన్నర కిలోల బంగారం దోచుకెళ్లిపోయారు. దీని విలువ సుమారు రూ. 2.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఘరానా దోపిడీ ముంబైలోని డోంబివలీలో ఉన్న రాజ్త్న్ర జ్యూయలర్స్‌లో శుక్రవారం జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా కొత్త నగల్ని యజమాని భరత్ జైన్ షాపులో అమ్మకానికి పెట్టారు. మధ్యాహ్నం భోజనానికి దుకాణాన్ని మూసి ఇంటికెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు షాపునకు కన్నం చేసి లోపలికి ప్రవేశించి బంగారాన్ని దోచుకెళ్లారు. దుకాణంలో నాలుగురోజుల్నుంచి సీసీటీవీలు పనిచేయట్లేదని యజమాని పేర్కొన్నారు. దీంతో ఇది తెలిసున్న వారి పనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.