గన్నవరంలో నగల దుకాణం లూటీ

 Jewelry Store thieves in gannavaram - Sakshi

గన్నవరం:  ప్రజలంతా ఓ పక్క సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో మునిగి తేలుతుంటే మరో పక్క దొంగలు ఎంచక్కా తమ పని కానిచ్చేశారు. ఐదు రోజుల కిందట గన్నవరంలో జరిగిన చోరీ ఘటన మరువక ముందే మరలా దొంగలు రెచ్చిపోయారు. గన్నవరంలోని దావాజిగూడెం రోడ్డులో ఉన్న ఓ నగల దుకాణాన్ని లూటీ చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.9 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించినట్లు దుకాణ యజమాని టి. శ్రీనివాసరావు తెలిపారు.

 విద్యానగర్‌లో నివసిస్తున్న శ్రీనివాసరావు దావాజిగూడెం రోడ్డులోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో శ్రీసాయి శ్రీనివాస జ్యూయలర్స్‌ నడుపుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల కిందట దుకాణం మూసివేసి కుటుంబ సమేతంగా స్వగ్రామమైన హనుమాన్‌జంక్షన్‌ వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగివచ్చిన శ్రీనివాసరావు దుకాణం తెరిచి చూడగా పైకప్పు రేకులు పగులకొట్టి ఉంది. దీంతో పాటు షాపులోని వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీఐ కె. శ్రీధర్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దుకాణాన్ని పరిశీలించి శ్రీనివాసరావు నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

 షాపులో విక్రయానికి సిద్ధంగా ఉన్న సుమారు 150 గ్రాముల బంగారు అభరణాలు, మరో 12 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దుకాణం మూసివేసిన మూడు రోజుల కాలంలో ఈ చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దుకాణదారుడితో పాటు వెనుక భవనంలో నివసిస్తున్న కాంప్లెక్స్‌ యజమానులు ఊళ్లో లేకపోవడమే అదునుగా భావించిన దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారని అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాగ్, క్లూస్‌ టీమ్‌లను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. 

వ్యాపార దుకాణలే లక్ష్యంగా...
వారం రోజులుగా పట్టణంలో వ్యాపార దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఐదు రోజుల కిందట బుద్దవరం బస్టాఫ్‌ వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి దొంగలు చొరబడి సుమారు రూ. 54 వేలు సొత్తును అపహరించుకుపోయారు. ఈ ఘటన మరువక ముందే దావాజిగూడెంలోని నగలు దుకాణంలో చోరీ జరగడం వ్యాపార వర్గాలను ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా చోరీల నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పట్టణ  ప్రజలు కోరుతున్నారు.  

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top