బాధితుల్లో 92 శాతం మంది 12–18 ఏళ్ల బాలికలు
99.8 శాతం నిందితులు బాధితులకు తెలిసినవారే
రోజుకు సగటున అయిదుగురు చిన్నారులపై అత్యాచారాలు
2023లో 1,760 అత్యాచార కేసులు నమోదు
ఎన్‌సీఆర్‌బీ–2023 నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2023 సంవత్సరంలో బాలలపై నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడిస్తోంది. చిన్నారులపై లైంగిక నేరాలు, కిడ్నాపింగ్ నేరాలు పెరగగా.. ఈ నేరాల్లో కౌమార దశ బాలికలు ప్రధాన బాధితులుగా ఉన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా–2023’నివేదికలో.. తెలంగాణ రాష్ట్రంలో బాలలపై నేరాలకు సంబంధించిన గణాంకాలివి. రాష్ట్రంలో 2023లో మొత్తం 6,113 బాలలపై నేరాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 8.1 శాతం పెరుగుదల నమోదైంది.
84 శాతం ఆ కేసులే..
చిన్నారులపై నమోదైన నేరాల్లో 84 శాతం కేసులు లైంగిక నేరాలు, కిడ్నాప్‌లే. మొత్తం బాలలపై నేరాలలో పోక్సో చట్టం కింద నమోదైన నేరాలు 51.6 శాతంగా ఉన్నాయి. 2023లో మొత్తం లైంగిక నేరాలు 4,900 కేసులను దాటాయి. లైంగిక దాడి కేసులలో 2022తో పోలిస్తే 38.3 శాతం పెరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేర సంఘటనల పెరుగుదలతో పాటు, ఫిర్యాదులు సత్వరమే నమోదు కావడం కూడా ఈ సంఖ్య పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన బాలలపై నేరాల్లో రెండో స్థానంలో ఉన్నాయి. ఇవి 2022తో పోలిస్తే 8 శాతానికి పైగా పెరిగాయి. 2023లో తెలంగాణలో మొత్తం 3,133 మంది చిన్నారులు కనిపించకుండా పోయినట్టు అధికారికంగా నమోదైంది.
కౌమార దశ బాలికలకు ఎక్కువ ముప్పు..
ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో పోక్సో కేసులలో బాధితుల్లో 99.9 శాతం మంది బాలికలే. వీరిలో 12–18 ఏళ్ల మధ్యనున్న బాలికలు మొత్తం బాధితుల్లో 92 శాతం మంది ఉన్నారు.
తెలిసినవారే నిందితులు..
ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. పోక్సో కేసులలో 99.8 శాతం మంది నిందితులు బాధితులకు తెలిసినవారే. ఇందులోనూ కుటుంబ సభ్యులు, పొరుగువారు, యజమానులు, స్నేహితులు, ఆన్‌లైన్ పరిచయస్తులు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు వివరిస్తున్నాయి. చిన్నారులు, ప్రత్యేకించి బాలికలు, అత్యధిక ప్రమాదం బయటివారి నుంచే కాకుండా, వారికి నమ్మకమైన వారి నుంచే ముప్పు వస్తోందని వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్ పరిచయాలు సైతం ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఆందోళనకరం
ఎన్‌సీఆర్‌బీ 2023 నివేదికలో వెల్లడించిన బాలలపై నేరాల్లో తెలంగాణకు సంబంధించిన గణాంకాలు ఆందోళనకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. కౌమార దశ బాలికలపై లైంగిక నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు అవసరం. ఇందుకు కమ్యూనిటీ విజిలెన్స్ బలోపేతం చేయాలి. డిజిటల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. – జాన్ రాబర్ట్స్, చైల్డ్ రైట్స్ అండ్ యూ, సౌత్ రీజనల్ డైరెక్టర్


