
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
కుల రాజకీయాలపై విశ్వాసం లేదని స్పష్టీకరణ
ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ
న్యూఢిల్లీ: సమాజంలో వెనుకంజలో ఉన్న బడుగు బలహీన వర్గాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి కుల గణన ఒక కీలకమైన ముందడుగు అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల రాజకీయాలపై తమకు విశ్వాసం లేదని అన్నారు. అణగారిన వర్గాల సాధికారితకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. భౌగోళికంగా అన్ని ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాల ప్రజలు, మహిళల ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు.
20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించినవారికి నివాళులరి్పంచారు. మూడో టర్మ్‌లో మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఈ భేటీలో ప్రధానమంత్రి మాట్లాడారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి మనం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆపరేషన్ సిందూర్ విజయమే సాక్ష్యమని తెలిపారు. ఉగ్రవాదుల భరతం పట్టడంలో మన స్వదేశీ రక్షణ సాంకేతికత కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. ఉగ్రవాద క్యాంప్‌లను నేటమట్టం చేయడంలో మన సైనిక దళాలు అద్భతంగా పనిచేశాయని పేర్కొన్నారు.
అత్యుత్తమ పాలనా విధానాలపై అధ్యయనం
ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్న ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) సహా వేర్వేరు రాష్ట్రాల్లోని అత్యుత్తమ పరిపాలనా విధానాలను మోదీ ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ ఒలింపిక్స్, అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం, బిహార్‌లో జల జీవన్ హరియాలీ అభియాన్, గుజరాత్‌లో సోలార్ విద్యుత్ కార్యక్రమం, మేఘాలయాలో పారదర్శక పరిపాలన వంటివి ఇందులో ఉన్నాయి. వీటిపై అధ్యయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు.
‘వికసిత్ భారత్’ సాధన కోసం ఎన్డీయే పాలిత రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారత్‌ను శక్తివంతమైన, స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని అన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. ‘ఎక్కడైనా, ఏదైనా మాట్లాడే’ ధోరణి మానుకోవాలని చెప్పారు.
క్రమశిక్షణతో కూడిన కమ్యూనికేషన్ అవసరమని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం ప్రమేయం ఎంతమాత్రం లేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టంచేశారు. పాకిస్తాన్ నుంచి వచి్చన విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు తాము అంగీకరించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు.
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలన్న నిర్ణయాన్ని కొనియాడుతూ మరో తీర్మానం ఆమోదించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డా, తదితరులు పాల్గొన్నారు. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను అమిత్ షా వివరించారు.