పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దోషిగా తేల్చిన కలకత్తా హైకోర్టు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్‌ను పశ్చిమబెంగాల్ శాసనసభ సభ్యునిగా అనర్హు డిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పువెలువరిచింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్ దేబాంగ్సు బసాక్, జస్టిస్ మొహమ్మద్ షబ్బార్‡ రష్దిల డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత న్యాయశాస్త్ర చరిత్రలో హైకోర్టు ఇలా ఒక శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించి అతని సభ్యత్వాన్ని రద్దుచేయడం ఇదే తొలిసారి అని కలకత్తా హైకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు.
తృణమూల్ సీనియర్ నేత అయన ముకుల్ రాయ్ గతంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతో విభేదాలొచ్చి పార్టీని వీడారు. తర్వాత బీజేపీలో చేరారు. దాంతో 2021 మేలో కృష్ణనగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. అయితే కేవలం నెలరోజులకే ఆయన మళ్లీ టీఎంసీ గూటికి చేరుకున్నారు. దీంతో ఆయన సభ్యత్వాన్ని రద్దుచేయాలంటూ బీజేపీ నేత సువేంధు అధికారి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తీర్పుపై సువేంధు సంతోషం వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగబద్ధ విజయమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఆయన తరఫున దాఖలైన నామినేషన్‌ను సైతం కోర్టు రద్దుచేసింది.


