
ఖరీఫ్‌లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
వరిధాన్యం క్వింటాల్‌పై రూ. 69
జొన్నలపై రూ. 328, కందులపై రూ. 450, పత్తిపై రూ. 589
ఎంఎస్పీ కోసం రూ. 2.70 లక్షల కోట్ల కేటాయింపులు
కేంద్ర కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం
కేంద్ర వ్యవసాయ శాఖ సిఫార్సులకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. 2025–26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన సిఫార్సులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు.
గత సంవత్సరం కంటే వరిధాన్యంపై ఎంఎస్పీని క్వింటాల్‌కు 3 శాతం, తృణధాన్యాలపై 5.9 శాతం, నూనె గింజలపై 9 శాతం పెంచారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తిని భారీగా పెంచే దిశగా అన్నదాతలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కనీస మద్దతు ధరను కేంద్రం పెంచినట్లు తెలుస్తోంది.
దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని, విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేబినెట్ కమిటీ సమావేశం వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచడంతోపాటు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫార్సుల మేరకు గత 11 ఏళ్లలో పంటలకు ఎంఎస్పీని భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. ఈ ఖరీఫ్‌లో వరిధాన్యం(గ్రేడ్–ఏ) మద్దతు ధరను రూ.69 పెంచినట్లు చెప్పారు. ఈ పెంపుతో క్వింటాల్ వరిధాన్యం ధర రూ.2,389కు చేరినట్లు వెల్లడించారు. ఎంఎస్పీ కోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించినట్లు స్పష్టంచేశారు. పంటల సగటు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.