
ఉన్నతాధికారుల వివరాలడిగారు
బీఎస్‌ఎఫ్ జవాన్‌ను వేధించిన పాక్ అధికారులు
న్యూఢిల్లీ: అనుకోకుండా సరిహద్దు దాటి పాక్ రేంజర్ల చేతికి చిక్కిన బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. విడుదల అనంతరం పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 21 రోజుల అనుభవాలను బీఎస్‌ఎఫ్ అధికారులతో షా పంచుకున్నారు. షా నిర్బంధంలో ఉన్నంత కాలం, పాకిస్తాన్‌లోని మూడు గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఆ ప్రదేశాల్లో ఒకటి ఎయిర్‌బేస్ సమీపంలో ఉంది.
కళ్లకు గంతలు కట్టి ఉంచడంతో.. విమాన శబ్దాలను బట్టి అది ఎయిర్‌బేస్‌గా షా గుర్తించారు. ఇక మరో ప్రదేశంలో జైలు గదిలో కొన్ని రోజులు ఉంచారు. కస్టడీలో ఉన్నన్ని రోజులు కళ్లకు గంతలు కట్టారు. నిద్రలేకుండా చేశారు. దూషించారు. కనీసం పళ్లు తోముకోవడానికి కూడా అనుమతించలేదు. శారీరకంగా హింసించకపోయినా.. సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్ భద్రతాదళాల గురించి ప్రశ్నించారు. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సీనియర్ అధికారుల వివరాలు చెప్పాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయినా షా వేటికీ సమాధానం ఇవ్వలేదు.
బీఎస్‌ఎఫ్ ప్రోటోకాల్ ప్రకారం.. విధుల్లో ఉండగా సెల్‌ఫోన్ వినియోగం నిషేధం. అందుకే షా పట్టుబ డిన సమయంలో అతని దగ్గర మొబైల్ ఫోన్ లేదు. దీంతో వివరాలేవీ పాకిస్తాన్ అధికారులకు దొరకలేదు. పాక్ కస్టడీ నుంచి వచి్చన షాపై బీఎస్‌ఎఫ్ అధికారులు విచారణ, వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ప్రోటోకాల్ ప్రకారం, పాకిస్తాన్ కస్టడీలో ఉండగా ఆయన ధరించి ఉన్న దుస్తులను తనిఖీ చేసి, పారవేశారు. ఆయన శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉన్నారని సమాచారం. ఏప్రిల్ 23న విశ్రాంతికోసం ఓ చెట్టునీడకు చేరిన షా.. అనుకోకుండా సరిహద్దు దాటాడు.