
ముంబై: హిందూత్వ నాయకుడు వీర్ సావర్కర్ గురించి చదివి అవగాహన పెంచుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. సావర్కర్ గురించి రాహుల్‌గాంధీ చేసిన బాధ్యతారహిత ప్రకటనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పిటిషనర్, అభినవ్ భారత్ కాంగ్రెస్ అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఆరోపించారు. ఆయన ప్రధానమంత్రి అయితే, అప్పుడు విధ్వంసం సృష్టిస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘మీ పిటిషన్‌లో అధ్యయనం చేయమని ఆదేశించాలంటూ మీరు కోరారు. కోర్టు చదవమని అతన్ని ఎలా బలవంతం చేస్తుంది?’ అని ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి సందీప్ మార్నేలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు.. ఆయన ప్రధాని అవుతారని మాకు తెలియదు.. మీకు తెలుసా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసుకునే చట్టపరమైన మార్గం పిటిషనర్‌కు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో వీర్ సావర్కర్ మవనడు పుణే కోర్టును ఆశ్రయించారని, విచారణ జరుగుతోందని ధర్మాసనం వెల్లడించింది.