తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా?, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లు, బీజేపీతో అత్యంత దగ్గరగా ఉండే శశిథరూర్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదొక వంకతో కాంగ్రెస్‌ను దూరం పెడుతూనే ఉన్నారు. తాజాగా కేరళ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సమావేశం కావడానికి సమయం ఫిక్స్ చేశారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) మధ్యాహ్నం గం. 2.30 ని.లకు సమావేశం కానున్నారు. అయితే దీనికి కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్ దూరంగా ఉండనున్నారట.
తనను ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ నుంచి అవమానం ఎదురైందనే భావనలో ఉన్నారు శశిథరూర్. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. తనకు తగినంత గౌరవం ఇవ్వలేదని శశిథరూర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అందుచేతనే ఆయన.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏఐసీసీ నేతల సమావేశానికి హాజరు కావడం లేదని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ కారణంగా శశిథరూర్.. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగే ఈ సమావేశానికి శశిథరూర్ దూరంగా ఉండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీడబ్యూసీ సమావేశానికి వెళ్లిన శశిథరూర్.. రాహుల్ గాంధీ సమావేశాలకు మాత్రం డుమ్మా కొడుతున్నారు. ఇదే ఇప్పుడు కేరళ కాంగ్రెస్‌లో అలజడికి కారణమైంది. ఎన్నికలు వచ్చిపడుతున్న వేళ.. శశిథరూర్ తీరు కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు.


