సముద్రం నీరూ తాగొచ్చు!

BMC Approves Desalination Project To Overcome Water Shortage - Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరంలో రోజురోజుకు జటిలమవుతున్న తాగునీటి సమస్య, ఏప్రిల్, మేలో అమలు చేస్తున్న నీటికోతను నివారించేందుకు సముద్రపు ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా తియ్యగా మార్చే ప్రక్రియ ప్రాజెక్టు నెలకొల్పాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది.  ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన సలహాదారుల కమిటీని నియమించే ప్రతిపాదనకు సోమవారం స్థాయి సమితిలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. నగరానికి సమీపంలో ఉన్న మనోరీ ప్రాంతంలో కీలకమైన ఈ ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. అందుకు అవసరమైన 12 హెక్టార్ల స్థలం ఎంటీడీసీ బీఎంసీకి అందజేయనుంది.

సుమారు రూ.1,600 కోట్లతో నిర్మాణం అయ్యే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రతీరోజు 200–400 మిలియన్‌ లీటర్ల సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి తాగేందుకు వీలుగా మారనుంది.కాగా సంబంధిత ప్రాజెక్టు ప్రతిపాదనను రూపొందించడానికి మెసర్స్‌ ఐడీఇ వాటర్‌ టెక్నాలాజీ అనే ఇజ్రాయిల్‌ కంపెనీకి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఈ కంపెనీ గత 50 ఏళ్లుగా ప్రపంచ స్ధాయిలో ఇదే రంగంలో ఉందని బీఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

జనావాసాలు పెరగడంతో.. 
మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్‌ త్రీవ్రత ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో ముంబైకి వచ్చే వలసలు మళ్లీ పెరిగిపోయాయి. గతంలో మాదిరిగా జనాభా పెరిగిపోసాగింది. ఫలితంగా నీటి వినియోగం కూడా పెరిగిపోనుంది. ఇప్పటికే ఉప నగరాలలో, శివార్లలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలవల్ల ముంబై విస్తీర్ణం రోజురోజుకు పెరగసాగింది. ముంబైలో కూడా అనేక బహుళ అంతస్తుల టవర్లు, భవనాలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు 50 ఇళ్లు ఉన్న చోట టవర్లు, ఎతైన భవనాలవల్ల వందల ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఏప్రిల్, మే, జూన్‌లో 10–15 శాతం నీటి కోత విధిస్తున్నారు. మరో ఐదు శాతం అప్రకటిత నీటి కోత అమలులో ఉంటుంది. అందరి దాహార్తి తీర్చడం బీఎంసీకి కష్టతరంగా మారింది.

భవిష్యత్తులో పెరిగే వలసల కారణంగా నీటి డిమాండ్‌ మరింత పెరిగే అవకాశముంది. దీంతో బీఎంసీ మనోరీ ప్రాంతంలో ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రాజెక్టు నెలకొల్పాలని సంకల్పించింది.  రోజుకు 200 మిలియన్‌ లీటర్ల నీరు శుద్ధి చేస్తుంది. ఆ తరువాత  400 మిలియన్‌ లీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంటుంది. ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా తియ్యగా మార్చే ప్రాజెక్టు నెలకొల్పేందుకు సుమారు రూ.1,600 కోట్లు ఖర్చవుతుండవచ్చని అంచనా వేశారు. అలాగే 20 ఏళ్లలో నీటి సరఫరాకు, నిర్వహణ, పరిశీలన పనులకు సుమారు రూ.1,920 కోట్లు ఇలా మొత్తం రూ.3,520 కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top