‘లిక్కర్‌ స్కామ్‌లో ‘కీ’ రోల్‌ కవితదే’.. కేసీఆర్‌ కూతురుకు బిగుస్తున్న ఉచ్చు?

BJP MP Parvesh Verma Said MLC Kavitha Role In Delhi Liquor Scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌.. తెలంగాణకు తాకింది. లిక్కర్‌ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించారు. ఈ క్రమంలో సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. 

లిక్కర్‌ మాఫియా వ్యవహారంపై ఎంపీ పర్వేశ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్‌ హోటల్‌లో లిక్కర్ సెటిల్‌మెంట్లు జరిగాయి. కవిత దక్షిణ భారతదేశానికి చెందిన లిక్కర్‌ వ్యాపారులను ఢిల్లీకి తీసుకువచ్చారు. కల్వకుంట్ల కవిత ద్వారానే రెడ్డి బ్రదర్స్‌, మాగుంట ఫ్యామిలీ ఢిల్లీకి వచ్చింది. వీరి ద్వారానే పంజాబ్‌, గోవా ఎన్నికల కోసం ఆప్ నాయకులకు అడ్వాన్స్‌గా డబ్బులు అందించారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీని ఓబెరాయ్ హోటల్‌లో తయారు చేశారు. లిక్కర్‌ పాలసీలో లబ్ధిపొందిన చాలా మంది వ్యాపారులు ఈ సమావేశాలకు వచ్చారు. కవితసైతం చాలాసార్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఎవరెవరికి లైసెన్స్‌లు ఇవ్వాలనే విషయంలోనూ కవిత మధ్యవర్తిత్వం వహించారు. పంజాబ్‌లో చద్దా ఫ్యామిలీకి చెందిన సీజ్డ్‌ లిక్కర్‌ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారు.

ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించినందుకు రూ. 4.50కోట్లు కవిత ద్వారా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకు అందాయి. ఇక, చద్దాస్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసినందుకుగానూ రూ. 3 కోట్ల క్యాష్, కోటిన్నర క్రెడిట్ నోట్ రూపంలో సిసోడియాకు ముడుపులు అందాయి. ఈ డబ్బు మొత్తం కవిత ద్వారానే సిసోడియాకు అందింది. డబ్బు అందగానే చద్దాస్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేశారు. తెలంగాణాలోని లిక్కర్ పాలసీని ఢిల్లీ, పంజాబ్‌, బెంగాల్‌లో అమలు చేసేలా కవిత మంతనాలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: లిక్కర్‌ కుంభకోణంలో కేసీఆర్‌ కుటుంబీకుల పాత్ర: బీజేపీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top