BJP MP Parvesh Verma Claims KCR Family Members Attended Meetings On Delhi Excise Policy Formulation - Sakshi
Sakshi News home page

Delhi Excise Policy: కుంభకోణంలో కేసీఆర్‌ కుటుంబీకుల పాత్ర: బీజేపీ

Published Mon, Aug 22 2022 5:38 AM

KCR family members attended meetings on Delhi excise policy formulation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించారు. ‘‘పాలసీ రూపకల్పన కోసం ఢిల్లీలోని ఒబెరాయ్, చండీగఢ్‌లోని హయత్‌ హోటళ్లలో జరిగిన భేటీల్లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్, ఆ శాఖ అధికారులు, లిక్కర్‌ మాఫియా∙వ్యక్తులు పాల్గొన్నారు. ఒబెరాయ్‌ హోటల్లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెల్ల కోసం బుక్‌ చేశాడు. డీల్‌ జరిగినన్ని రోజులు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ విమానంలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చేవారు.

లిక్కర్‌ మాఫియా కమిషన్‌ను 10 శాతానికి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా తొలి విడతగా రూ.150 కోట్లు సిసోడియాకు లంచంగా ముట్టింది. దీన్ని తెలంగాణ లిక్కర్‌ మాఫియానే ఇచ్చింది. గోవా, పంజాబ్‌ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆప్‌కు లిక్కర్‌ మాఫియా అడ్వాన్స్‌ చెల్లింపులు జరిపింది. ఆ తర్వాతే పంజాబ్‌లోనూ, ఢిల్లీలోనూ కొత్త మద్యం విధానాల అమలు మొదలైంది. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా ఎక్సైజ్‌ విధానాన్నే అక్కడ కేసీఆర్‌ కుటుంబీకులు అమలు చేయించారు’’ అని ఆరోపించారు. లిక్కర్‌ పాలసీపై కేసీఆర్‌ కుటుంబీకులతో భేటీ అయ్యారో లేదో సిసోడియా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement