బిహార్ కొత్త సీఎంపై ఊహాగానాలు
నితీశ్ కొనసాగుతారని జేడీ(యూ) పోస్టు
నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా నుంచి తొలగింపు
సీఎం పదవిపై కన్నేసిన బీజేపీ
రేసులోఉప ముఖ్యమంత్రి సామ్రాట్
పట్నా: బిహార్‌లో ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారా? లేక మరో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. మళ్లీ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ సోషల్ మీడియాలో జేడీ(యూ) పోస్టు చేసింది. కొద్దిసేపటికే దాన్ని తొలగించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నితీశ్‌ను మరోసారి సీఎంను చేయడం బీజేపీకి ఇష్టంలేదని ప్రచారం సాగుతోంది.
నితీశ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి, బీజేపీ నాయకుడినే గద్దెనెక్కిస్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి తమ కూటమి గెలిస్తే నితీశ్ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచి్చంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీశ్ సైతం మళ్లీ కుర్చి ఎక్కాలని ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని పటా్నలో భారీగా పోస్టర్లు, బోర్డులు వెలిశాయి. ‘‘25 నుంచి 30.. మళ్లీ నితీశ్’’ అంటూ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర తరహా ప్రయోగం
బిహార్ ఎన్నికల్లో బీజేపీ తన బలం చాటుకుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ)పై ఆధారపడాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోయింది. జేడీ(యూ)ను పక్కనపెట్టి, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)తో పొత్తు కొనసాగిస్తే బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం తేలికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం జేడీ(యూ) అండతో మనుగడ సాగిస్తోంది. కాబట్టి జేడీ(యూ) స్నేహాన్ని వదులుకొనే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో మహారాష్ట్ర తరహా ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదు.
మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో శివసేన(షిండే) నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీ చివరకు తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎంగా కిరీటం అప్పగించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సమీకరణాలు కలిసొస్తే ఆయన బిహార్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. బిహార్ ఎన్డీయేలో పెద్దన్న జేడీ(యూ). ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీ (యూ)తో సమానంగా సీట్లు పంచుకుంది. రెండు పక్షాలు 101 సీట్ల చొప్పున తీసుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు నెగ్గి, జేడీ(యూ)పై స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది.


