ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం! | Bihar Muzaffarpur Hospital Fire Accident News Updates | Sakshi
Sakshi News home page

ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!

Jun 4 2026 6:50 AM | Updated on Jun 4 2026 8:49 AM

Bihar Muzaffarpur Hospital Fire Accident News Updates

పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్‌లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రసాద్‌ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.

అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.

ప్రాథమిక విచారణలో.. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్‌లోని హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్‌లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.

కీలకాంశాలు

  • బిహార్‌లోని ముజఫర్‌పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

  • ఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలు

  • ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!

  • 20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారు

  • పలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్‌

  • షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానం

  • కొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement