
పట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన వివాదం ఇప్పుడు డబుల్ ఓటరు ఐడీ నోటీసుల వరకూ దారి తీసింది. తాజాగా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు పోల్ బాడీ నోటీసు జారీ చేసింది. నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తున్న తరుణంలో విజయ్ కుమార్ సిన్హా ఎన్నికల కమిషన్ నుండి నోటీసు రావడం గమనార్హం.
తాజాగా బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం‘ఎక్స్’లోచేసిన ఒక పోస్ట్‌లో తన అసెంబ్లీ సీటు అయిన లఖిసరైలో ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ, దానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అలాగే పట్నాలోని బంకిపూర్‌లో కూడా ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ ఆధారం చూపించారు. ఈ నేపధ్యంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం ఐదు గంటలలోపు దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు.
రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజస్వి యాదవ్ తాజాగా ఉప ముఖ్యమంత్రికి రెండు ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, సిన్హాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిన్హా మాట్లాడుతూ తాను ఒకేచోట నుండి ఓటు వేశానని, తేజశ్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన పేరు ఒటరు జాబితాలో రెండు చోట్ల ఉండటానికిగల కారణాలను వివరిస్తూ.. తొలుత తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే 2024 ఏప్రిల్ లో, తాను లఖిసరైలో తన పేరును జతచేర్చుకునేందుకు దరఖాస్తు చేశానన్నారు. అదే సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ నుండి తొలగించేందుకు ఫారమ్‌ను కూడా నింపి సమర్పించానన్నారు. అయితే ఏవో కారణాలతో బంకిపూర్ నుండి తన పేరు తొలగించలేదని విజయ్ కుమార్ సిన్హా వివరణ ఇచ్చారు.