
బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో నాలుగేళ్ల తరువాత ఆటో రిక్షా ఛార్జీలను అధికారికంగా సవరించారు. దీని ప్రకారం ప్రయాణికులు 2025, ఆగస్టు ఒకటి నుంచి, మొదటి రెండు కిలోమీటర్లకు రూ.36 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత బేస్ ఛార్జీ రూ.30 నుంచి పెరిగింది. ప్రతి అదనపు కిలోమీటరుకు ఛార్జీ రూ.18గా సవరించారు. గతంలో కి.మీ.కు రూ.15గా ఉంది. జిల్లా రవాణా అథారిటీ అధ్యక్షుడు, బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ ఈ సవరణను తెలియజేశారు.
దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, మొదటి 5 నిమిషాల వెయిటింగ్ సమయం ఉచితం. అయితే ఆ తర్వాత ప్రతి 15 నిమిషాల వెయిటింగ్‌కు రూ.10 వసూలు చేయనున్నారు. ప్రయాణీకులు 20 కిలోల వరకు బరువున్న లగేజీని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తీసుకెళ్లవచ్చు. ఉచిత పరిమితిని దాటిన ప్రతి 20 కిలోలకు రూ.10 అదనపు ఛార్జీ వర్తిస్తుంది. సవరించిన ఛార్జీలు రాత్రి ప్రయాణానికి కూడా వర్తిస్తాయి. కాగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలలో కొత్త ఛార్జీల చార్ట్‌ను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు.
ఛార్జీల సవరణపై వివిధ రవాణా సంఘాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఆటో ఛార్జీల పెంపును తాము స్వాగతిస్తున్నామని కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నటరాజ్ శర్మ అన్నారు. అయితే, అదనపు కిలోమీటరుకు ఛార్జీని రూ. 18కి బదులుగా రూ. 20గా చేయాలని ఆయన సూచించారు. డ్రైవర్లు అగ్రిగేటర్ యాప్‌లకు బదులుగా, మీటర్‌పై ఆటోలను నడపాలని శర్మ కోరారు. కాగా కొన్ని ఆటో యూనియన్లు బేస్ ఫేర్ రూ. 20 ఉంటుందని ఆశించామని పేర్కొన్నాయి.