
టచ్ స్క్రీన్స్ వాడేటప్పుడు జాగ్రత్త
డ్రైవర్ దృష్టిని మరల్చుతున్నాయ్
హంగుల కంటే భద్రతే ప్రధానం
బ్రాండ్, కారు పనితీరు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మాత్రమే కాదు.. కారు లోపల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా కారు కొనుగోలు సమయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త మోడళ్లు హైటెక్, ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ తో వస్తున్నాయి. ఖుషీఖుషీగా కారులో ప్రయాణిస్తూ.. ఈ టచ్ స్క్రీన్ల వాడకంలో కొందరు బిజీ అయిపోతున్నారు. అదిగో, అదే మంచిది కాదు, అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ‘టచ్‌స్క్రీన్’ చర్చనీయాంశంగా మారింది.
ఫోన్ కాల్స్, ఏసీ, నావిగేషన్, సంగీతం, 360 డిగ్రీ వ్యూ.. ఇలా ఎన్నో ఫీచర్లను డ్రైవర్ ముందున్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ నియంత్రిస్తోంది. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ లేనప్పటికీ కొందరు తమ కార్లలో వీడియోలు ప్లే అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడటం ప్రమాదకరం. అలాగే, కారులో కూడా టచ్ స్క్రీన్ వాడకం.. డ్రైవింగ్ మీద దృష్టిని మరల్చే పెద్ద సమస్యగా పరిణమిస్తోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
సులభమేమీ కాదు
సాధారణంగా డ్రైవర్లు.. దృష్టి మరల్చకుండానే స్టీరింగ్‌కు, డ్రైవింగ్ సీటుకు సమీపంలో ఉన్న బటన్లను సులభంగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో ముఖ్యమైన బటన్లను కంపెనీలు స్టీరింగ్ వీల్‌పై అమర్చుతున్నాయి. కానీ, టచ్‌స్క్రీన్ ఉపయోగించడం అంత సులభం కాదు. ఒక నిర్దిష్ట సెట్టింగ్‌ను కనుక్కోవాలంటే ఒక విండో నుంచి మరొక విండోకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ ఫీచర్‌ను వినియోగించాలన్నా సమయం తీసుకుంటుంది.
‘వీ బుల్గరీ’ అధ్యయనంలో..
2022లో స్వీడిష్ మోటరింగ్ మ్యాగజైన్ ‘వీ బుల్గరీ’ ఓ అధ్యయనం చేపట్టింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియో స్టేషన్ మార్చడం, ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేయడం వంటి పనులకు డ్రైవర్లకు ఎంత సమయం పట్టిందో పరిశీలించారు.
ఇందులో వినియోగించిన 12 కార్లలో 11 కార్లకు టచ్‌స్క్రీన్స్ ఉన్నాయి. బటన్లతో కూడిన ఒకే ఒక పాత కారు ఉపయోగించారు. పాత కారులో డ్రైవర్లు నిర్దేశించిన పనులను 10 సెకన్లలోపు చేయగలిగారు. కానీ ఆధునిక మోడళ్లలో అవే పనులకు సుమారు 45 సెకన్లు పట్టింది. డ్రైవర్ల దృష్టిని టచ్‌స్క్రీన్లు ఎంతలా మరల్చుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
మరో రెండు అధ్యయనాల్లో..
ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌పై వేర్వేరు పనులు చేస్తున్నప్పుడు డ్రైవర్లు ఎంతసేపు పరధ్యానంగా ఉన్నారో తెలుసుకోవడానికి నార్వేకు చెందిన కాంట్రాక్ట్ పరిశోధన సంస్థ ‘సింటెఫ్’ 2024లో ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం కంటి చూపును పసిగట్టే ట్రాకింగ్ కెమెరాలను ఉపయోగించారు. రోడ్డు వైపు చూడకుండా ఉష్ణోగ్రతను మార్చడానికి డ్రైవర్లకు సగటున మూడున్నర సెకన్లు పట్టింది.
రేడియో స్టేషన్ మార్చడానికి 11 సెకన్లు, నావిగేషన్ టూల్‌లో కొత్త చిరునామాను చేర్చడానికి 16 సెకన్ల సమయం తీసుకున్నారు. 2020లో బ్రిటిష్ సంస్థ ‘ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం.. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించి నడిపే డ్రైవర్లలో డ్రైవింగ్ కంటే టచ్ స్క్రీన్లే రియాక్షన్ టైమ్‌ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. దేనికైనా స్పందించే రేటు.. డ్రైవింగ్ వల్ల కంటే టచ్‌స్క్రీన్ ఆపరేట్ చేయడం వల్లే తక్కువగా ఉంటోందన్నమాట.
స్విచ్‌ల ద్వారా..
‘యూరో ఎన్ సీఏపీ’,, యూరప్‌లో కార్లకు భద్రతా రేటింగ్స్ ఇచ్చే సంస్థ. నిజానికి ఇది చట్టబద్ధమైన సంస్థ కాదుగానీ, ఇది ఇచ్చే రేటింగ్స్‌ని కార్ల కంపెనీల ప్రామాణికంగా భావిస్తాయి. వచ్చే జనవరి నుండి విక్రయించే కార్లకు ఈ సంస్థ కొత్త నియమాలు నిర్దేశించింది. దీని ప్రకారం విండ్‌స్క్రీన్ వైపర్ల వంటి ముఖ్యమైన ఫంక్షన్లు టచ్‌స్క్రీన్ల ద్వారా కాకుండా ఫిజికల్ స్విచ్‌ల ద్వారా నియంత్రించేలా ఏర్పాటు చేయకపోతే ఏ కారుకూ ఫైవ్ స్టార్ స్కోర్ ఇవ్వరు.
మన దేశంలో కార్లను విక్రయించే కంపెనీలు స్టీరింగ్‌పై అనువుగా కొన్ని బటన్స్ను పొందుపరుస్తున్నాయి. ఎందుకంటే.. టచ్‌స్క్రీన్లతో పోలిస్తే ఫిజికల్ బటన్లు వాడటమే డ్రైవర్లకు సులభంగా ఉంటుంది. అయితే ఈ బటన్లు కూడా వాడటం కష్టమనుకునే వారికోసం చాలా వాహన తయారీ సంస్థలు వాయిస్ కంట్రోల్‌తో పనిచేసేలా ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎంత గొప్ప కారు అయినా.. ముందు భద్రత ప్రధానం.. తరవాతే ఎన్ని హంగులైనా!
ఇలా చేయండి..
» డ్రైవ్ చేసే ముందు లేదా సురక్షితమైన స్థలంలో వాహనం ఆపి రేడియో, జీపీఎస్, ఏసీ వంటి సర్దుబాట్లు చేసుకోండి.
» ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దృష్టి మరలుతుంది. కాబట్టి మీ ఫోన్ ను వాహనం బ్లూటూత్‌కు అనుసంధానించవద్దు.
» వాహనంలో ప్రత్యామ్నాయ బటన్లు ఉంటే వాటిని ఉపయోగించండి.
» మీ పక్క సీటులో ఎవరైనా ఉంటే.. వారికి టచ్‌స్క్రీన్ బాధ్యతలు అప్పగించండి.
– సాక్షి, స్పెషల్ డెస్క్