
దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్, కోవిడ్ మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో కోవిడ్‌పై ఉన్న భయాన్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేసారు. కనకపుర తాలూకా ముళ్లహళ్లి గ్రామానికి చెందిన మాజీ గ్రామపంచాయతీ ఉపాధ్యక్షుడు లోకేశ్‌కు ఇటీవల కరోనా సోకింది. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముళ్లహళ్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరపగా ఎంపీ డీకే సురేశ్ కేవలం ఫేస్ షీల్డ్ ధరించి హాజరయ్యారు.
మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత
రామనగర జిల్లాకు చెందిన సుమారు 200 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న బెంగళూరు ఆర్‌ఆర్ నగర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ఎంపీ డీకే సురేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి మీడియాకు సమాచారమిచ్చిన ఆయన రామననగర జిల్లా మరో చామరాజనగర్‌గా మారకముందే ఆక్సిజన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈమేరకు ఆయన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్టు తెలిపారు.