
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆవేదన
అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరం
బాలికలపై ఏఐ, ఇతర టెక్నాలజీల దురి్వనియోగాన్ని గుర్తించాలి
ఇందుకు సలహా కమిటీ ఏర్పాటు అవకాశాలను సుప్రీంకోర్టు పరిశీలించాలి
బాలికల హక్కులపై జరిగిన జాతీయ సదస్సులో జస్టిస్ బీవీ నాగరత్న సూచనలు
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత సాంకేతికతతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపుల పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరమన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ తరహా సాంకేతిక పరమైన దురి్వనియోగాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశలో ‘‘ఏఐ సైబర్‌క్రైమ్ అడ్వైజరీ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్’’అనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూచించారు. న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నారు.
లింగ ఆధారిత బ్రూణ, శిశు హత్యలపై ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు బాలికలకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతనూ ఉద్ఘాటించారు. ఆయా అంశాలు అన్నింటిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపునకూ కృషి జరగాలని ఉద్భోదించారు. యూనిసెఫ్ ఇండియాతో కలిసి సుప్రీంకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం’అనే అంశంపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సులో జస్టిస్ బీవీ నాగరత్న ముగింపు ఉపన్యాసం చేశారు. జేజేసీ సభ్యులు కూడా అయిన జస్టిస్ నాగరత్న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
→ తరచుగా మారుతున్న టెక్నాలజీల వల్ల కలిగే ప్రమాదాలు.. నిరంతరం తలపై వేలాడుతున్న ఖడ్గం లాంటిది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత టెక్నాలజీల ద్వారా బాలల హక్కులు దురి్వనియోగం కాకుండా తగిన చట్టాలను రూపొందించాలి. ఆయా అంశాలపై 24 గంటల సమాచారం వ్యవస్థ, నిరంతరం స్పందించే జాతీయ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి.
→ చట్టం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బాలిక భారమనే అపోహను తొలగించే దిశలోకి తల్లిదండ్రుల దృక్పథం మారాలి.
→ బాలికను కాపాడటం అంటే తరతరాలను కాపాడడమంటూ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయం హర్షణీయం.
→ ఆహారమే ఉత్తమ ఔషధం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిల్లలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి పాఠశాల సిలబస్‌లో పోషకాహార విద్యను చేర్చాలి. పాఠశాలల చుట్టూ జంక్‌ఫుడ్ ప్రకటనలను నిషేధించాలి.
→ బాలికల అక్రమ రవాణా నిరోధక చర్యలు మరింత ఫలప్రదం కావాలంటే ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తును ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ ట్రేసింగ్‌తో అనుసంధానించి ప్రొఫెషనల్‌గా నిర్వహించాలి. అలాంటి బాలికల పునరావాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా వ్యవస్థ పటిష్టం కావాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించే వ్యవస్థను నెలకొల్పాలి.
→ బాధితుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ప్రతి జిల్లాలో పిల్లలకు, మహిళలకు వైద్య, మానసిక, న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి.
→ పోలీసులకు, న్యాయ వ్యవస్థ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం, బాధితుల సంతృప్తి తీరుపై వార్షిక సమీక్ష అవసరం.
→ అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వికలాంగుల విభాగాలకు సంబంధించిన బాలికలకు రాజ్యాంగం, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందాల ప్రకారం తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆయా ప్రయోజనాలు వారికి అందేట్లు చూడాలి.
→ లింగ నిష్పత్తి మెరుగుదల కోసం జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో గణాంకాల ను సమీక్షిస్తూ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది.
సైబర్ నేరాలపై పటిష్ట దర్యాప్తు పద్దతులు లేవు: జస్టిస్ పార్దీవాలా
సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా మాట్లాడుతూ క్లిష్టమైన సైబర్ నేరాలను ఎదుర్కొనే దర్యాప్తు విధానాలు దేశంలో సమర్థంగా లేవని అన్నారు. ప్రస్తుత సైబర్ యుగంలో బాలికలు బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలుసహా భారతదేశంలోని అనేక స్థానిక తెగలలో బాలిక పుట్టినప్పుడు సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటారని, అది అందరూ నేర్చుకోవాల్సిన విషయమని సూచించారు.