దేశంలోనే తొలిసారి: ఒకేసారి 2 వేరియంట్ల బారిన పడ్డ వైద్యురాలు | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలిసారి: ఒకేసారి 2 వేరియంట్ల బారిన పడ్డ వైద్యురాలు

Published Tue, Jul 20 2021 11:36 AM

Assam Doctor Infected With Alpha and Delta Variant of Coronavirus Simultaneously - Sakshi

డిస్పూర్‌: దేశంలో కరోనా వైరస్‌ ఇంకా కట్టడిలోకి రాలేదు. మహమ్మారి రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా తయారవుతూ.. ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. తాజాగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ వ్యాప్తి కొనసాగతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారి ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి కోవిడ్‌ రెండు వేరియంట్ల బారిన పడ్డారు. సదరు వైద్యురాలు ఒకేసారి ఆల్ఫాతో పాటు ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ బారిన పడ్డట్లు తెలిసింది. 

అసోంలోని దిబ్రుగఢ్‌ జిల్లా, లాహోవాల్‌లోని ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్‌ఎంఆర్‌సి) నోడల్ ఆఫీసర్‌ డాక్టర్ బిస్వాజ్యోతి బోర్కాకోటి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బిస్వాజ్యోతి మాట్లాడుతూ.. ‘‘తాజాగా కోవిడ్‌ బారిన పడ్డ ఓ మహిళా డాక్టర్‌లో మేం ఒకేసారి కరోనా రెండు వేరియంట్లను గుర్తించాము. ఇప్పటికే ఆమె రెండు డోసుల టీకా తీసుకున్నారు. అయినప్పటికి వైరస్‌ బారిన పడ్డారు’’ అని తెలిపారు. 

బిస్వాజ్యోతి మాట్లాడుతూ.. ‘‘మేం బాధిత వైద్యురాలి శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షించాం. ఈ క్రమంలో ఆమెకు ఒకేసారి కోవిడ్‌ వైరస్‌కు చెందిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకాయి.ఒకే వ్యక్తిపై వైరస్‌ రెండు వేరియంట్లు ఒకేసారి దాడి చేయడం దేశంలో ఇదే ప్రథమం. మొదట మేం ఈ విషయాన్ని నమ్మలేకపోయాం. మా అనుమాన నివృత్తి కోసం మరోసారి ఆమె శాంపిల్స్‌ పరీక్షించాం. అప్పుడు కూడా సేమ్‌ అదే ఫలితం వచ్చింది. ఇక ఆమె భర్తకు ఆల్ఫావేరియంట్‌ సోకింది’’ అని తెలిపారు. 

ప్రస్తుతం వైద్యురాలిలో కోవిడ్‌ లక్షణాలు తీవ్రంగా లేవని.. అందువల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. కొద్ది రోజుల క్రితం బెల్జియానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల బారిన పడిన సంగతి తెలిసిందే. కాకపోతే అప్పటి​కి సదరు వృద్ధురాలు వ్యాక్సిన్‌ తీసుకోలేదు. ఈ క్రమంలో ఆమె మార్చి, 2021న మృతి చెందారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement