సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్‌...పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు

Arvind Kejriwal Said Dont Come To CM Police Official Transferred - Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక సందేశం పంపించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడవద్దని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే.. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను తప్పనిసరిగా కలవాలని కేజ్రీవాల్ అన్నారు.

గతంలో.. పంజాబ్‌ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే ఎస్‌పీలు/ఎస్‌ఎస్‌పీలను బదిలీ చేయించుకుని.. తమ నియోజకవర్గాల్లో దందాలను నడిపించుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్‌ ఎమ్మెల్యేలు మాత్రం అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పోలీసుల బదీలీలకు సంబంధించిన  ప్రక్రియను సీఎం భగవంత్‌మాన్‌కు, మంత్రులకు వదిలేయాలని.. ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని, కేవలం నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటే చాలని అన్నారు. అలా కాకుండా అధికార ధోరణి ప్రదర్శిస్తే.. పరిణామాలు వేరుగా ఉంటాయని, చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అలాగే పార్టీ ఎమ్మెల్యేలంతా టీమ్‌గా పని చేయాలని కోరారు. మన వ్యక్తిగత ఆశయాలను వదిలి.. జట్టుగా పని చేస్తే పంజాబ్ పురోగమిస్తుంది అని కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు. ఈ జట్టుకు భగవంత్‌ మాన్‌ నాయకుడని కేజ్రీవాల్‌ నొక్కి చెప్పారు. పార్టీ నాయకులు, వాలంటీర్లు ఎల్లప్పుడూ హుందాగా వ్యవహరించాలని, అసభ్య- అభ్యంతరకరమైన ప్రవర్తనలను సహించేదే లేదని కేజ్రీవాల్ హెచ్చరించారు.

(చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం.. అది జరిగితే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top