మత మార్పిడుల పర్యవసానం....?

Anti Conversion Law And Its Results - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చట్ట విరుద్ధమైన మత మార్పిడులను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నవంబర్‌ 24వ తేదీన తీసుకొచ్చిన కొత్త చట్టం పర్యవసానాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గత జూలై నెలలోనే పెళ్లి చేసుకున్న రషీద్‌ అలీ, పింకి డిసెంబర్‌ ఐదవ తేదీన తమ పెళ్లిని రిజిస్టర్‌ చేయించుకునేందుకు రిజిస్టార్‌ కార్యాలయానికి వెళ్లినప్పుడు వారిపై బజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్తలు దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా రషీద్‌ అలీని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించి, పింకీ షెల్టర్‌ హోమ్‌కు పంపించారు. 

దాడిలో గాయపడిన కారణంగా షెల్టర్‌ హోమ్‌లో పింకీకి గర్భస్రావం అయింది. ‘నేను మేజర్‌ను నాకు 22 ఏళ్లు. నేను ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. గత జూలై 24వ తేదీన మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్లై అయిదో నెల నడుస్తోంది. దయచేసి మమ్మల్ని వదిలి పెట్టండి’ అంటూ పింకీ ప్రాధేయ పడినా బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలుగానీ, పోలీసులు వినిపించుకోలేదంటూ సామాజిక కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఆమె దాడి వీడియోను సర్కులేట్‌ చేశారు. 

దేశంలో ఎప్పటి నుంచో దళితులు, వెనకబడిన వర్గాల మత మార్పిడులు కొనసాగుతున్నాయి. సమాజంలో దళితులను చిన్న చూపు చూస్తున్నందుకు నిరసనగా సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 1956లో ఓ దళిత బృందంతో కలసి బౌద్ధం మతంలోకి మారారు. తమిళనాడులో మారవ సామాజిక వర్గానికి చెందిన భూస్వాముల అణచివేతకు నిరసనగా 1981లో ఆ రాష్ట్రంలోని మీనాక్షిపురంలో వెయ్యి మంది దళితులు ఇస్లాం మతం పుచ్చుకున్నారు. 2002లో హర్యానాలోని జాజ్జర్‌లో చనిపోయిన ఆవును దాచారన్న కారణంగా ఐదుగురు దళితులపై జరిగిన దాడికి నిరసనగా వందలాది దళితులు బౌద్ధ మతంలోకి మారారు. 

గత అక్టోబర్‌ నెలలో ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో వాల్మీకి కులానికి చెందిన దళిత యువతిని అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు రేప్‌ చేసి, హత్య చేసినందుకు వాల్మీకి కులానికి చెందిన 200 మంది దళితులు బౌద్ధంలోకి మారారు. యూపీ తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఇలాంటి మత మార్పిడులన్నీ చట్ట విరుద్ధం అవుతాయని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వల్ల ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైతే చట్ట ప్రకారం గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని, అదే మతం మారితే పదేళ్లు జైలు శిక్ష వేయడం ఏమేరకు సముచితమని వారు ప్రశ్నిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top