పోలీసు సంస్కరణల్లో ‘ఆంధ్ర’ భేష్‌

Analysis Of Police Reforms In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు శాఖలో సంస్కరణలకు సంబంధించి సుప్రీం కోర్టు 14 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలను ఒక్క ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు మాత్రమే పాక్షికంగా అమలు చేస్తుండగా, మిగతా రాష్ట్రాలు అరకొరగా అమలు చేస్తున్నాయని ‘ఇంటర్నేషనల్‌ కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇన్షియేటివ్‌’ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో పోలీసు సంస్కరణలకు సంబంధించి నేషనల్‌ పోలీసు కమిషన్‌ 1979 నుంచి చేస్తోన్న సిఫార్సులనే కాకుండా 1996లో దాఖలైన ఓ ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకొని సుప్రీం కోర్టు ఏడు సూచనలను చేసింది. అందులో ఐడు సూచనలు రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సినవికాగా, మరోటి కేసుల దర్యాప్తు విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించినది. 
(చదవండి: తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించం)

నేషనల్‌ పోలీసు కమిషన్‌ సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రకాష్‌ సింగ్, ఎన్‌కే సింగ్‌ అనే ఇద్దరు పోలీసు డైరెక్టర్‌ జనరల్స్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని పురస్కరించుకొని సుప్రీం కోర్టు ఈ సూచనలు జారీ చేసింది. వాటిలో ఒకటి రాష్ట్రాల స్థాయిలో ‘స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌’ను ఏర్పాటు చేయడం. దేశంలోని 28 రాష్ట్రాలకుగాను 93 శాతం రాష్ట్రాలు మాత్రమే ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మాత్రమే కమిషన్‌ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా అమలు చేయాలనే నిబంధనలను పెట్టాయి. పోలీసులపైన రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి లేకుండా చేయడం కోసమే ఈ నిబంధనను తీసుకొచ్చారు. క్రిమినల్‌ కేసుల్లో పోలీసులపై ప్రభుత్వాల ఒత్తిడి ఉందంటూ ప్రతి ముగ్గురు పోలీసు అధికారుల్లో ఒకరు ఆరోపిస్తుండగా, నేర పరిశోధనల్లో తాము రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నామని 38 శాతం పోలీసు అధికారులు ఓ సర్వేలో వెల్లడించిన విషయం ఇక్కడ గమనార్హం. 

రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోతే బదిలీ వేటును ఎదుర్కోవాల్సి వస్తోందని 63 శాతం పోలీసు సిబ్బంది వెల్లడించినట్లు ‘కామన్‌ కాజ్, లోక్‌నీతి’ సంస్థలు ‘స్టేటస్‌ ఆఫ్‌ పోలీసింగ్‌ ఇన్‌ ఇండియా–2019’ నివేదికలో పేర్కొన్న విషయమూ ఇక్కడ గమనార్హమే. పోలీసు అధికారులను మాటి మాటికి బదిలీ చేయకుండా పోస్టింగ్‌ ప్లేస్‌కు పరిమిత కాలం గడువు ఉండాలంటూ సుప్రీం కోర్టు చేసిన మరో సూచనను కొన్ని రాష్ట్రాలే పాటిస్తున్నాయి. పోలీసు అధికారుల ఎంపిక కోసం కేవలం ఐదు రాష్ట్రాలే యూపీఎస్‌సీ మీద ఆధార పడుతుండగా, కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ పదవులకు రెండేళ్ల నిర్దిష్ట కాల పరిమితిని నిర్ధేశించాయి. ఈ రెండు అంశాలను కచ్చితంగా అమలు చేస్తోన్న రాష్ట్రాల్లో ఒకటి అరుణాచల్‌ ప్రదేశ్‌కాగా, రెండోది నాగాలాండ్‌. 
(చదవండి: 'వైఎస్‌ఆర్‌ జలకళ' పథకానికి శ్రీకారం)

ఐజీపీ, ఇతర పోలీసు అధికారుల నిర్దిష్ట కాల పరిమితిని కనీసం రెండేళ్లు ఉండాలనే సూచనను దేశంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్‌ రాష్ట్రాలు మాత్రమే అమలు చేస్తున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాకు సరాసరి సగటున 193 మంది పోలీసులు ఉండాల్సి ఉంటే దేశంలో నేడు 151 మంది మాత్రమే ఉన్నారు. పోలీసు సిబ్బందిలో 33 శాతం మహిళలు ఉండాలనే నిబంధనను తొమ్మిది రాష్ట్రాలే అమలు చేస్తున్నాయి. పోలీసు అధికారుల అవినీతి, అక్రమాలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ‘పోలీసు కంప్లెంట్స్‌ అథారిటీ’ని ఏర్పాటు చేయాలనే సూచనను కేవలం పది రాష్ట్రాలే అమలు చేస్తున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top